Retired Employee : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహారం ‘మొదటి బిడ్డకు మొగుడు లేడుగానీ చివరి బిడ్డకు కళ్యాణం అన్నట్లు’ గా ఉన్నదని ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించి మోసం చేశాడని ఆయన విమర్శించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అనేక మంది గుండెపోటుతో మరణించారని చెప్పారు.
డబ్బులు వస్తే చికిత్స చేయించుకుందామని ఇంకా చాలామంది వేచి చూస్తున్నారని ఆయన తెలిపారు. అప్పులు కట్టలేక అప్పు ఇచ్చిన వారి నుంచి తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులను కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఆరోపించారు. ‘నువ్వు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నావు కదా..?’ అని తన తోటి ఉద్యోగులు తనను నిలదీస్తున్నారని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి అసలు విషయాల నుంచి దృష్టి మళ్లించడానికి గ్లోబల్ సమ్మిట్ అని, నైట్ ఎకానమీ అని, కవిత రాజీనామా అని మభ్యపెడుతున్నారని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే తమకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.