Minister Gangula Kamalakar | బడుగు బలహీనర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని శుక్రవారం మంత్రి గంగుల ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్దత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా పలు పార్శ్వాలతో కూడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయం అని కొనియాడారు. బాపూజీ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భావితరాలకు ఆయన చరిత్ర తెలిసేలా గ్రామాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వెనుకబడిన కులాలు ముందుకెళ్లాలని చివరివరకు కోరుకున్న వ్యక్తి బాపూజీ అని, అంబేడ్కర్ లాగే బాపూజీని కూడా మనం స్మరించుకోవాలి అని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధికి నోచుకోక పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నా అధ్వాన్నంగా ఉండేవని మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడంతో పల్లెల రూపురేఖలు మారిపోయయని అన్నారు. ఆనాడు పల్లెల పరిస్థితి నేటి పల్లెల పరిస్థితిలో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలని సూచించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలను ఇబ్బందులు పెట్టిన పార్టీలు ఇప్పుడు ఓట్ల కోసం మళ్లీ వస్తున్నాయని అన్నారు. మాయమాటలు చెప్పే ఆ పార్టీ నాయకులతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని అన్నారు. ప్రజలకు పనిచేయాలనే ఆలోచన కేవలం కేసీఆర్ ప్రభుత్వానికే ఉందన్నారు. తనకు ఓటు వేస్తే మరింత గొప్పగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసి.. వారిని రక్షించుకునే బాధ్యత తనదని స్పష్టం చేశారు.