ఢాకా: రానున్న టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో ఆడకుంటే వేటు తప్పదని ఐసీసీ హెచ్చరించినా బంగ్లాదేశ్ మాత్రం పట్టు వీడలేదు. ఐసీసీ ఇచ్చిన 24 గంటల అల్టిమేటాన్ని, మరో దేశంతో భర్తీచేస్తామన్న హెచ్చరికనూ ఆ దేశం లెక్కచేయలేదు. తాము మొదట్నుంచి చెబుతున్నట్టుగానే భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదని, ఆ దేశంలో ప్రపంచకప్ ఆడే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అయితే తాము ఇంకా నమ్మకం కోల్పోలేదని, ఐసీసీ తమకు న్యాయం చేస్తుందన్న విశ్వాసం ఉందని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ అసిఫ్ నజ్రుల్ తెలిపారు.

ఐసీసీ అల్టిమేటం నేపథ్యంలో నజ్రుల్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, సీఈవో నిజాముద్దీన్‌తో సమావేశం అయ్యారు. మీటింగ్ తర్వాత నజ్రుల్ మాట్లాడుతూ.. ‘మేం ప్రపంచకప్ ఆడాలనే అనుకున్నాం. మా క్రికెటర్లు అందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధమయ్యారు. వారు కఠోర శ్రమతో టోర్నీకి అర్హత సాధించారు. కానీ భారత్‌లో మా జట్టు భద్రత విషయంలో రాజీపడేది లేదు. భద్రత గురించి ఐసీసీ ఏమి చెప్పినా అది ఒక దేశం కాదని మనం అర్థం చేసుకోవాలి. అది చెప్పేదానిపై మేం పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు. మా ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందనేది వాస్తవం.
ఐపీఎల్లో ఒక జట్టుకు ఆడాల్సి ఉన్న ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఆ దేశ అతివాదుల బెదిరింపులకు తలొగ్గిన బీసీసీఐ.. అతడిని టోర్నీ నుంచి తప్పించింది. ఈ విషయంలో బీసీసీఐ, భారత ప్రభుత్వం మమ్మల్ని ఒప్పించలేకపోయింది. ముస్తాఫిజుర్ వ్యవహారంపై వాళ్లు మాకు క్షమాపణ చెప్పలేదు. అందుకే మా విధానం (భారత్‌లో ప్రపంచకప్ ఆడకపోవడం)లో ఎటువంటి మార్పూ లేదు. ఇది మా ప్రభుత్వం నిర్ణయం. ఇదే విషయాన్ని మా ఆటగాళ్లతోనూ చెప్పాం. వారు దీనిని అర్థం చేసుకున్నారు’ అని తెలిపాడు.

ఇక టోర్నీలో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలన్న ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడంపైనా బంగ్లా మండిపడింది. ఈ విషయంలో ఐసీసీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తుందని ఆరోపించింది. ఇదే విషయమై బీసీబీ అధ్యక్షుడు అమినుల్ మాట్లాడుతూ.. ‘ఐసీసీ మాకు 1996, 2003 ఉదంతాలను వల్లివేస్తున్నది. కానీ నిరుడు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వగా భారత్ అక్కడికి వెళ్లమంటే ఆ దేశ మ్యాచ్‌లను యూఏఈకి తరలించలేదా? ఆ జట్టు మ్యాచ్‌లన్నీ అక్కడ జరిగింది వాస్తవం కాదా? అందరూ శ్రీలంకను సహా ఆతిథ్య దేశమని అంటున్నారు.
కానీ నిజానికి వాళ్లు కో-హోస్ట్‌లు కాదు. హైబ్రిడ్ మోడల్ (పాకిస్థాన్ మ్యాచ్‌ల కోసం)లో అది ఒక భాగం మాత్రమే. మా ప్రభుత్వం భారత్‌లో ఆడేందుకు అనుమతి నిరాకరించినప్పట్నుంచీ మేం శ్రీలంకలో ఆడేందుకు ఐసీసీకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్లు మా అభ్యర్థనను పట్టించుకోవడం లేదు’ అని అన్నాడు.
ఈ టోర్నీని భారత్‌లో ఆడకుంటే బహిష్కరణ వేటు వేస్తామన్న అంశంపై అమినుల్ స్పందిస్తూ.. ‘మా జట్టును చూసి గర్విస్తున్నాం. మా దేశంలో సుమారు 20 కోట్ల మంది క్రికెట్ అభిమానులున్నారు. ఇంతమంది టీ20 ప్రపంచకప్‌ను చూడకుంటే అది ప్రపంచ క్రికెట్‌కు, ఆతిథ్య దేశానికి, ఐసీసీకే తీరని నష్టం. క్రికెట్‌ను 2028 ఒలింపిక్స్‌లో చేర్చారు. భారత్ కామన్వెల్త్, ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం బిడ్ వేస్తున్నది. కానీ క్రికెట్‌ను ప్రేమించే బంగ్లాదేశ్ వంటి దేశాన్ని ప్రపంచకప్‌లో ఆడించకపోవడం వారి వైఫల్యం’ అని చెప్పాడు.
బంగ్లా నిర్ణయం నేపథ్యంలో ఐసీసీ ఏం చేయనుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌కు రాకుంటే ఆ దేశంపై వేటు వేసి స్కాట్లాండ్తో ఆడిస్తామని హెచ్చరించినా బంగ్లా పద్ధతి మార్చుకోలేదు. ఇప్పటికే మంగళవారం ఐసీసీ శాశ్వత సభ్య దేశాలతో కీలక సమావేశం ఏర్పాటుచేయగా 16కు గాను 14 దేశాలు బంగ్లాకు వ్యతిరేకంగా ఓటువేసిన విషయం తెలిసిందే.
తాజా పరిణామంతో ఐసీసీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా? లేదా? పునరాలోచనలో పడుతుందా? అనేది ఆసక్తికరం. గ్రూప్ స్వాపింగ్ (గ్రూప్-సీలో ఉన్న బంగ్లాదేశ్.. ‘బీ’లో ఉన్న ఐర్లాండ్‌తో)కు ఐర్లాండ్ ఒప్పుకోకపోవడం ఐసీసీకి తలనొప్పిగా మారింది. దీంతో బంగ్లా స్థానాన్ని స్కాట్లాండ్తో భర్తీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి.