మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్ జోరు కొనసాగిస్తున్నది. గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌లో తనదైన వేగం, టెక్నిక్‌తో ప్రత్యర్థులకు చుక్కలుచూపించే ఈ రెండో సీడ్.. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 6-2, 6-3తో మేరీ బొజ్కొవా (చెక్)ను చిత్తుచేసి మూడో రౌండ్‌కు చేరింది. ప్రత్యర్థి నుంచి ఆమెకు కనీస ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు. ఈ విజయంతో స్వియాటెక్.. టెన్నిస్ ఓపెన్ ఎరాలో 24 సార్లు గ్రాండ్‌స్లామ్ మూడో రౌండ్‌కు చేరిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచింది.
మిగిలిన మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ (యూఎస్).. 6-1, 7-5తో తన దేశానికే చెందిన క్రుగర్‌ను వరుస సెట్లలో ఓడించింది. జెస్సికా పెగులా (యూఎస్).. 6-0, 6-2తో కెస్లర్ను మట్టికరిపించగా, ఐదో సీడ్ రిబాకినా (కజకిస్థాన్).. 7-5, 6-2తో వర్వర గ్రెచెవ (ఫ్రాన్స్)ను, జపాన్ అమ్మాయి నవొమి ఒసాకా 6-3, 4-6, 6-2తో సొరన కిర్స్టియ (రొమానియా)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరారు.

పురుషుల సింగిల్స్‌లో దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్.. 6-3, 6-2, 6-2తో ఫ్రాన్సెస్కొ (ఇటలీ)పై అలవోక విజయం సాధించాడు. ఈ సెర్బియా దిగ్గజానికి ఇది 399వ గ్రాండ్‌స్లామ్ విజయం కావడం విశేషం. మరో మ్యాచ్ గెలిస్తే 400 మ్యాచ్‌లు గెలిచిన తొలి ఆటగాడిగా అతడు రికార్డులకెక్కుతాడు. మరో పోరులో సిన్నర్.. 6-1, 6-4, 6-2తో జేమ్స్ డక్‌వర్త్‌పై గెలిచాడు.