లండన్ : గుండె సంబంధిత తీవ్ర పరిస్థితులను క్షణాల్లో గుర్తించగలిగే కృత్రిమ మేధ (ఏఐ) స్టెతస్కోప్‌ను అభివృద్ధి చేశామని బ్రిటన్ వైద్యులు తెలిపారు. సాధారణంగా ఉపయోగించే చెస్ట్ పీస్‌కు బదులుగా ఈ ఆధునిక స్టెతస్కోప్ ఓ కార్డ్ పరిమాణంలో ఉన్న పరికరాన్ని ఉపయోగిస్తుంది. దీనిలో మైక్రోఫోన్ ఉంటుంది.
ఇది గుండె కొట్టుకోవడంలో అత్యంత సూక్ష్మమైన మార్పులను, రక్త ప్రవాహాన్ని సైతం గుర్తించగలదు. మానవుడి చెవి గుర్తించడం సాధ్యం కానటువంటి వాటిని ఇది పసిగడుతుంది. ఇది ఈసీజీ (ఎలక్ట్రోకార్డియోగ్రామ్) చేసి, ఫలితాలను క్లౌడ్‌కు పంపిస్తుంది. అక్కడ వేలాది హృదయ సంబంధిత రికార్డులపై శిక్షణ పొందిన ఏఐ ఉంటుంది. అది ఈ డాటాను విశ్లేషిస్తుంది.