న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud).. ఇటీవల బీబీసీ హార్డ్‌టాక్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జర్నలిస్టు స్టీఫెన్ సకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. భారతీయ న్యాయవ్యవస్థలో.. ఉన్నత వర్గాల హిందువులు, పురుషుల ఆధిపత్యం ఉన్నట్లు జర్నలిస్టు ప్రశ్న వేశారు. దానికి బదులిస్తూ.. తన తండ్రి వైవీ చంద్రచూడ్.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారని, కానీ ఆ సమయంలో కోర్టుకు రావొద్దు అని తన తండ్రి ఆదేశించారని, దాని వల్ల మూడేళ్ల పాటు హార్వర్డ్ లా స్కూల్లోనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించినట్లు డీవై చంద్రచూడ్ తెలిపారు. తన తండ్రి రిటైర్ అయిన తర్వాతే మొదటిసారి సుప్రీంకోర్టులోకి అడుగుపెట్టినట్లు చెప్పారు.
భారతీయ న్యాయవ్యవస్థలోని ఓవరాల్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే, చాలా వరకు లాయర్లు, జడ్జీలు అందరూ ఫస్ట్ టైం ఎంట్రీలే అన్నారు. మీరు చేసిన కామెంట్‌కు ఇది విరుద్దమైందన్నారు. న్యాయవ్యవస్థలో ఉన్నత కులాల ఆధిపత్యం ఏమీ లేదని, ఇప్పుడిప్పుడే న్యాయ వ్యవస్థలోకి మహిళల ప్రవేశం పెరిగిందన్నారు. ప్రస్తుతం న్యాయ విద్య అందరికీ అందుతున్నదని, దీంతో మహిళలు కూడా ఈ ప్రొఫెషన్లోకి ప్రవేశిస్తున్నారని, జిల్లా న్యాయస్థానాల్లో మహిళల సంఖ్య పెరిగిందని, రాబోయే రోజుల్లో వాళ్లు సుప్రీం వరకు చేరుకుంటారన్నారు.
మోదీ ప్రభుత్వం నుంచి ఏమైనా వత్తిడి ఎదుర్కొన్నారా అని ప్రశ్నించగా.. దానికి సమాధానం ఇస్తూ.. 2024 జనరల్ ఎలక్షన్స్‌లో ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయని, ఆ పార్టీలు తమతమ రాష్ట్రాలను పాలిస్తున్నాయన్నారు. ఆర్టికల్ 370, సీఏఏ, అయోధ్య రామాలయ తీర్పులపై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో .. పార్లమెంట్లో ప్రతిపక్షం పోషించే పాత్రను న్యాయవ్యవస్థ పోషించలేదన్నారు. కోర్టులో తాము ఉండేది కేసుల్ని పరిష్కరించేందుకు అని, అది కూడా చట్టం పరిధిలో జరుగుతుందని మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.