హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముల్లును ముల్లుతోనే తీయాలంటారు పెద్దలు. టెక్నాలజీతో బురిడీ కొట్టించి కోట్లు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లను అదే టెక్నాలజీ వినియోగించి ఆటకట్టించారు హైదరాబాద్ సైబర్ పోలీసులు. సినీఫక్కీలో అంతా 10 నిమిషాలలోనే వారిని కటకటాల వెనక్కితోశారు. అసలేం జరిగిందంటే.. ‘సార్.. కేవైసీ అప్డేట్ పేరుతో నా దగ్గర డబ్బు కొట్టేశారు.. అయినా ఇంకా పని పూర్తికాలేదు.. మరోమారు మీరు కేవైసీ అప్డేట్ చేయాలంటూ మళ్లీ ఫోన్ చేస్తున్నారు.. మీరే ఆ నేరగాళ్లను పట్టుకోవాలంటూ ఓ బాధితుడు ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సార్ నేరగాళ్లు ఫోన్లో మాట్లాడుతున్నారు.. మీరే వినండంటూ ఇన్పెక్టర్ ప్రశాంత్ చేతికిచ్చాడు. వెంటనే తమ సిబ్బందిని అలర్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ఆ నంబర్‌కు ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో వెంటనే లైవ్ లొకేషన్ ట్రేస్ చేయాలంటూ ఆదేశించారు. నిమిషాల వ్యవధిలోనే లైవ్ లొకేషన్ జార్ఖండ్‌లోని దేవఘర్ జిల్లా మార్గముండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నుంచి వస్తున్నదని సమాచారం వచ్చింది. ఒకపక్క సైబర్‌నేరగాళ్లతో మాట్లాడుతూనే.. మార్గముండ సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు లైవ్ లొకేషన్ షేర్ చేశారు. స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఊరిబయట ఉన్న సైబర్ అడ్డాను గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఠాణాకు బాధితుడు రావడం.. అక్కడి నిందితులతో ఫోన్లో మాట్లాడటం.. సమాచారం ఇవ్వడం అంతా 10 నిమిషాల్లోనే జరిగింది. సిటీ పోలీసుల సమాచారంతో సైబర్ నేరగాళ్ల అడ్డాపై దాడిచేసిన విషయాన్ని అక్కడి పోలీసులు దేవఘర్ ఎస్పీ ధనుంజయ్కుమార్సింగ్ తెలిపారు. ఇలా సమన్వయంతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో నేరస్తులను పూర్తిగా అణిచివేయవచ్చంటూ ప్రశంసించారు.