హైదరాబాద్ సిటీబ్యూరో/మూసాపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో తీవ్ర కలకలం రేపిన పదేండ్ల బాలిక సహస్ర హత్యకేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. పక్కింట్లో ఉండే పదో తరగతి విద్యార్థే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. చిన్నారి బర్త్ డే రోజున కేక్ తినిపించిన చేతులతోనే కత్తితో విచక్షణా రహితంగా ఆమెను పొడిచి చంపాడని తెలిసి స్థానికుల్లో దిగ్భ్రాంతి వ్యక్తమైంది. తరచూ క్రైమ్ సంబంధిత సన్నివేశాలు చూసే అలవాటున్న బాలుడు దొంగతనం ఎలా చేయాలో ఓటీటీలో ఒక క్రైమ్ వెబ్ సిరీస్ చూసి పేపర్‌పై స్క్రిప్ట్ రాసుకుని మరీ ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లాకు చెందిన కృష్ణ, రేణుక దంపతులు తమ కూతురు సహస్ర(10), కొడుకు సద్విన్ (8)తో కలిసి రెండేండ్లుగా కూకట్పల్లి, సంగీత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్ పెంట్హస్లో ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌కు ఆనుకుని ఉన్న మరో అపార్ట్మెంట్ 4వ అంతస్తులో 10వ తరగతి చదువుతున్న బాలుడు తన తల్లి, ఇద్దరు సోదరిలతో ఉంటున్నాడు. బాలుడి తండ్రి కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో తల్లి స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తూ పోషిస్తున్నది. సహస్ర తమ్ముడుతో స్నేహం చేసిన 10వ తరగతి బాలుడు తరచూ ఆడుకునేందుకు వారి ఇంటికి వెళ్లేవాడు.
ఈ క్రమంలో వారి ఇంట్లో ఉన్న దేవుడి గల్లాపెట్టెపై కన్నేశాడు. ఈ నెల 18న సహస్ర తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరని బావించి భవనం 3వ అంతస్తు నుంచి సహస్ర ఉండే భవనంలోకి దూకి వారి ఇంట్లో చొరబడి దొంగతనానికి యత్నించాడు. ఆ రోజున పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి గమనించి కేకలు వేసింది. దొంగతనానికి వచ్చిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్తానని బెదిరించింది. దీంతో దొరికిపోతానని భావించిన బాలుడు వెంట తెచ్చుకున్న కత్తితో సహస్రను పొడిచి హత్యచేశాడు. చనిపోయిందో లేదోనన్న అనుమానంతో మరోసారి బాలిక గొంతుపై పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయాడు.
ఘటన జరిగిన అపార్ట్‌మెంట్‌తో పాటు చుట్టుపక్కల కూడా ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో చిన్నారి హత్యకేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. భవనంలోకి చొబడేందుకు ఉన్న అవకాశాలపై పోలీసులు అన్వేషణ మొదలు పెట్టి వెనకాల ఉన్న అపార్ట్మెంట్ వాసులను విచారించారు. ఈ క్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను విచారించగా హత్య జరిగిన రోజు తన గది పక్కనే సుమారు అరగంటకు పైగా ఓ బాలుడు దాగున్నట్టు తెలిపాడు. ఆ బాలుడు అదే అపార్ట్మెంట్లో ఉంటాడని తెలుసుకున్న పోలీసులు అతడి పాఠశాలకు వెళ్లి అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించినట్టు తెలిసింది. బాలుడి ఇంట్లో సోదాలు చేయగా హత్యకు వాడిన కత్తి, రక్తపు మరకలతో కూడిన దుస్తులు, స్క్రిప్ట్ రాసుకున్న పేపర్ దొరికాయి.
ఆ బాలుడికి తరచూ నేర పూరితమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లను చూసే అలవాటు ఉన్నది. ఈ క్రమంలోనే ఘటనకు రెండు రోజుల ముందు ఓటీటీలో క్రైమ్ వెబ్‌సిరీస్ చూసి సహస్ర ఇంట్లో దొంగతనానికి స్కెచ్ వేశాడు. దొంగతనం ఎలా చేయాలి? చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి?, ఆధారాలు దొరక్కుండా ఎలా జాగ్రత పడాలి? అన్న అంశాలను పేపర్‌పై రాసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. గత ఏప్రిల్ 19న సహస్ర జన్మదినానికి కూడా బాలుడు వచ్చి కేక్ తినిపించినట్టు తెలిసింది. బాలిక శరీరంపై 18 కత్తిపోట్లు ఉన్నాయి. కేకు తినిపించిన చేత్తోనే ఆ బాలుడు కత్తితో బాలికను చంపాడని తెలిసి స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.