పక్కా ప్రణాళికతో సైబర్ నేరాలకు చెక్ పెడుతాం
వార్షిక నివేదిక విడుదల సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర
శేరిలింగంపల్లి, డిసెంబర్ 27: ప్రపంచానికి అనువైన నగరంగా హైదరాబాద్‌ను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది, తమ వంతు బాధ్యతగా నిబద్ధతతో పని చేసి సైబరాబాద్‌లో శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సోమవారం గచ్చిబౌలి కమిషనరేట్ కార్యాలయంలో 2021 వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది ఎదురైన సవాళ్లను అన్నింటిని ప్రజల మద్దతుతో అధిగమించి శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఐటీ కారిడార్ విస్తరణ, అభివృద్ధి, కొత్త ప్రాంతాల అవతరిస్తుండటంతో పోలీసు సేవలు మరింత వేగంగా అందించేందుకు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యంతో పని చేస్తుండటంతో మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు చెప్పారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో 5.30 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 6.30 నిమిషాల్లో పోలీసు సేవలను అందిస్తున్నామని సీపీ వెల్లడించారు. కొత్త సంవత్సరంలో కేసుల ను సమర్థవంతంగా దర్యాప్తు చేయడంతో పాటు నేరం చేసిన ప్రతి నిందితుడికి శిక్షలు పడేలా విచారణ చేపట్టడం.. రోడ్డు భద్రత మరింతగా పెంచడం, మహిళలు, పిల్లల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు 2022లో పని చేస్తారని, పక్కా ప్రణాళికతో సైబర్ నేరా లకు చెక్ పెడుతామని సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.
వార్షిక నివేదికలోని అంశాలివి..
సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది 30954 కేసులు నమోదు.
చోరీలు, దొంగతనాల కేసులు 4768
రోడ్డు ప్రమాదాల్లో తగ్గుదల.. మరణాలు చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల కేసులు 712 నమోదు.
మహిళలపై జరిగిన నేరాలపై 2621..
సైబర్ క్రైమ్స్‌కు సంబంధించి 3854..
ఆర్థిక నేరాలపై 413 కేసులు నమోదు
చోరీలు, దోపీడీలు దొంగతనాల్లో మొత్తం 22.32 కోట్లు సొత్తు తస్కరణ.. రూ. 11.74 కోట్లు రికవరీ
వేగవంతంగా పెండింగ్ కేసుల విచారణ
కమిషనరేట్ పరిధిలో నేరాలను అరికట్టేందుకు 1,36,961 పెట్టీ కేసులు నమోదు.
మత్తు పై పంజా విసిరి.. 205 కేసులను నమోదు చేసి 444 మంది నిందితులను అరెస్టు చేశారు.
ఆర్థిక నేరాలపై 606 కేసులు నమోదు. 72 నిందితులు అరెస్టు. రూ. 27 కోట్లు ఫ్రీజ్
సైబర్ క్రైం మోసాలపై 3854 కేసులు. 587 కేసుల చేధన. 164 మంది అరెస్టు. 13 మంది నేరస్తులపై పీడీ యాక్ట్.
1791 కేసులు నమోదు చేసి 3709 మందిని అరెస్టు చేసిన ఎస్వోటీ పోలీసులు.
షీ టీమ్స్ డయల్ 100కు 3711 ఫిర్యాదులు అన్ని పరిష్కరించిన ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్.
22 బాల్య వివాహాలను ఆపిన షీ టీమ్స్.
వెట్టి చాకిరీ నుంచి 136 మందికి విముక్తి.
రోడ్డు ప్రమాదాల్లో 759 మంది మృతి. 3708 మందికి తీవ్రగాయాలు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలను నడిపిస్తున్న 34746 కేసులు నమోదు. 9981 డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్‌కు సిఫార్సు. 3790 మందికి జైలు.
ఎస్సీఎస్సీ భాగస్వామ్యంతో ఐటీ కారిడార్‌లో సంపూర్ణ భద్రత.