
సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): జలమండలి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేస్తున్నట్లు ఎండీ దానకిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన వేతనాలను నవంబర్ నుంచే చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఉద్యోగుల జీతం దాదాపు రూ.7 వేల నుంచి రూ.25 వేలకు పెరగనుంది. పీఆర్సీ అమలుతో జలమండలిలో పని చేస్తున్న 3,900 మంది ఉద్యోగులు, 3,200 మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, 500 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తం 7600 మందికి లబ్ధి జరుగుతుండగా.. సంస్థపై మాత్రం నెలకు రూ.12 కోట్ల భారం పడనున్నది. పీఆర్సీ పెంపుతో ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని డివిజన్లలో వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఆర్ఎస్కేవీ) ఆధ్వర్యంలో ఉద్యోగులు సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి సంబురాలు జరిపారు. మంత్రి కేటీఆర్, యూనియన్ గౌరవ అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ దాన కిశోర్‌కు యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎండీ దానకిశోర్‌తో పాటు ఉన్నతాధికారులకు ఉద్యోగులు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ కె.రాజిరెడ్డి, యూనియన్ ప్రధాన కార్యదర్శి జైరాజ్, వరింగ్ ప్రెసిడెంట్లు జి.లక్ష్మీనారాయణ, సయ్యద్ అక్బర్ అలీ, చంద్రశేఖర్, జంగయ్య, అడ్వైజర్లు టీవీ లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ షకీల్, యూనియన్ కార్యవర్గ సభ్యులుపాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
కార్మిక పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. వాటర్ బోర్డు ఉద్యోగులంటే సీఎంకు అమితమైన ప్రేమ. మొన్ననే ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేశారు. బోర్డు ఆదాయం తగ్గినా ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం ఆనందంగా ఉంది.
– రాంబాబు యాదవ్, టీఆర్ఎస్కేవీ