
కుత్బుల్లాపూర్, నవంబర్ 17 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలోని కూడళ్ల అభివృద్ధికి ఎస్ఆర్డీపీ కింద నిధులు మంజూరు చేసి వేగవంతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక కార్పొరేటర్లతో హైదరాబాద్ నగర కమిషనర్ లోకేశ్కుమార్ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సర్కిళ్ల పరిధిలోని ప్రధాన చౌరస్తాల అభివృద్ధిపై చర్చించారు. నియోజకవర్గంలోని ఐడీపీఎల్, కుత్బుల్లాపూర్, ఉశోదయ, సూరారం జంక్షన్ల వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. సానుకూలంగా స్పందించిన బల్దియా కమిషనర్ జంక్షన్ల అభివృద్ధికి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, చింతల్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ తదితరులు ఉన్నారు.
మంచినీటి వ్యవస్థపై జలమండలి ఎండీకి వినతి..
కత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో నెలకొన్న మంచినీరు, డ్రైనేజీ సమస్యలను పరిస్కరించాలని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ కోరారు. బుధవారం స్థానిక కార్పొరేటర్లతో కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థను విస్తరించాలన్నారు. మంచినీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఉన్నారు.