వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు శుభవార్త. ఈ-చలానా జారీ అయి జరిమానా చెల్లించని వారికి భారీ రాయితీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పేదలు, మధ్యతరగతి వారి ఆర్థిక స్థితిగతులతోపాటు బకాయిల చిట్టా ఏటా పెరుగుతుండడంతో రాయితీ కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వాహనాల ఆధారంగా 80, 75, 70, 50 శాతం చొప్పున రాయితీ ఇచ్చేందుకు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు సూచనప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది.
ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో సుమారు 2 కోట్ల ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉండగా, రూ.600 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ద్విచక్రవాహనదారులు, ఆటోవాలాలే అధికంగా ఉన్నారు. రాయితీతో కూడిన జరిమానా చెల్లించేందుకు మార్చి 1 నుంచి నెలాఖరు వరకు అవకాశమివ్వనున్నారు. మీసేవ, ఈసేవా కేంద్రాలు, టీఎస్ ఈ-చలాన్ పోర్టల్ లేదా ప్రత్యేక లింకు ద్వారా చెల్లింపులు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ చలాన్లలో నగరవాసులకు శుభవార్త. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. బైక్, ఆటోలపై ఉన్న జరిమానాలలో 75 శాతం రాయితీ, తోపుడు బండ్లపై ఉన్న కేసులపై 80 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ, కార్లు, మిగతా వాహనాలకు 50 శాతం రాయితీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు హైదరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సూచనప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ట్రాఫిక్ పోలీసులు ఇవ్వనున్న భారీ రాయితీ ఎంతో ఉపయోగపడుతుందని వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్‌లో 2కోట్ల చలాన్లు
ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులపై కాంటాక్టు, నాన్ కాంటాక్ట్ పద్ధతిలో ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ చలన్లు జారీ అయినా చాలా మంది చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో రూ. 600 కోట్ల విలువైన సుమారు 2 కోట్ల వరకు ఈ చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్లను ఆన్లైన్లో చెల్లించేలా ప్రత్యేక లింక్‌ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రెండు కమిషనరేట్ల పరిధిలోనే..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ చలాన్ల వ్యవస్థ ఒకే గొడుగు కింద పనిచేస్తున్నది. దీంతో ఒక వాహనంపై ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని టీఎస్ పోలీస్ ఈ చలాన్ వెబ్సైట్లో చూసుకోవాలి. అందులో ఆ వాహనంపై జారీ అయిన చలాన్లు కన్పిస్తాయి. ఈ స్కీమ్‌కు ప్రస్తుతానికి హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. త్వరలోనే సైబరాబాద్ కూడా అంగీకరించే అవకాశం ఉంది. అలా జరిగితే ఈ స్కీమ్ మూడు కమిషనరేట్లకు వర్తిస్తుంది. లేదంటే రెండు కమిషనరేట్లలోనే మార్చి 1నుంచి నెలంతా అమలులోకి తెచ్చే అవకాశాలున్నాయి.
వాహన సంఘాల హర్షం
వాహన పెండింగ్ ఈ చలాన్లపై భారీ రాయితీ ఇవ్వడంపై వాహన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, బీఎంఎస్ తదితర సంఘాల నాయకులు బుధవారం నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌ను కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, సిటీ అధ్యక్షులు డి శ్రీనివాస్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి కిరణ్, బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్, అమానుల్లాఖాన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శంకర్ లాల్ రమావత్, నిరంజన్ ఇబ్రహీం రామకృష్ణ, కట్రావత్ సేవాలాల్ పాల్గొన్నారు.