సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుపై హైదరాబాద్ జిల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 100మంది చొప్పున మొత్తం 15 నియోజకవర్గాల నుంచి 1500 దరఖాస్తులు స్వీకరించారు. లబ్ధిదారుల ఎంపికకు మంగళవారం నుంచి అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. తొలి అవగాహన సమావేశాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ ఎల్ శర్మన్ జిల్లా సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్‌తో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో దళితబంధు పథకాన్ని విజయవంతంగా నిర్వహించాలని, లబ్ధిదారులందరూ ప్రయోజనం పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పథకం అమలులో అన్ని జిల్లాలో కంటే హైదరాబాద్ జిల్లా ముందువరుసలో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, రిసోర్స్ పర్సన్లతో అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. ఈ పథకం అమలులో జిల్లా అధికారులందరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రిప్రియ, జిల్లా సంక్షేమ శాఖాధికారి అక్కేశ్వరరావు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ఖాసీం, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పవన్‌కుమార్, ఎల్డీ రవిశంకర్ ఠాగూర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆశన్న, కోఆపరేటీవ్ అధికారి పద్మ, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లాలో రేపటి నుంచి శిక్షణ
దళితబంధు లబ్ధిదారులకు ఈ నెల 23న శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల వారీగా ఒక్క రోజు శిక్షణ తరగతులను నిర్వహించే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 5 వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. శిక్షణ పూర్తయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలలోకి నగదు జమ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. లబ్ధిదారులు దరఖాస్తులలో పొందుపరచిన యూనిట్ల గురించి అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు.