సికింద్రాబాద్, ఫిబ్రవరి 20: కంటోన్మెంట్‌లోని కషా యం నేతలు నోటికి పని చెబుతున్నారు. రెండేండ్ల క్రితం మంజూరైన పనులకు తాజాగా కొబ్బరికాయలు కొడుతూ ఫొటోలకు ఫోజులిస్తూ…..చెమటోడ్చి పనులను చేయిస్తున్నామని డ్రామాలకు తెరలేపుతున్నారు. కంటోన్మెంట్‌కు రాష్ట్ర సర్కారు ఏం చేస్తుందంటూ నోరు పారేసుకుంటున్నారు. ఇక్కడి ఆదాయం సర్కారు ఖాతాలో వేసుకుంటుందని ప్రజలకు నూరిపోస్తున్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలటీలకు ఇస్తున్న నిధులను కూడా ఇవ్వడం లేదని ముసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ ఇక్కడ ఓ విషయాన్ని కాషాయం నేతలు మరిచినట్లు కనిపిస్తుంది. సర్కారు గోరంత ఇచ్చేది ఉంటే…..కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ చార్జీలు కొండంత ఉన్న సంగతిని పక్కనబెడుతున్నారు. కేంద్రం నుంచి బోర్డుకు ఆర్మీకి సంబంధించిన బకాయిలు సుమారు రూ.680 కోట్లు ఉన్నప్పటికీ కేంద్రంలో ఉన్న తమ సర్కారు నుంచి బకాయిలు విడుదల చేయించేందుకు మాత్రం నోరు రావడం లేదు. రాష్ట్రం కంటోన్మెంట్‌పై వివక్ష చూపుతుందన్న కమలం నేతలకు…..కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు దేశంలోని పలు రాష్ర్టాలను ఒక తీరుగా తెలంగాణను మరోతీరుగా చూస్తున్న విషయం గుర్తుకులేదా అని గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు.
జనం చెవ్వుల్లో కమలం పూలు
కంటోన్మెంట్ ప్రాంతంపై ప్రేమ ఉందంటూ ఊదరగొట్టుకుంటున్న బీజేపీనేతల తీరును స్థానికులు గమనిస్తూనే ఉన్నారు. పదవి నుంచి దిగిపోవాలని పార్టీ ఆదేశాలు ఇవ్వగానే రాత్రికి రాత్రే కండువాలు మార్చి పదవుల కోసం జనం చెవ్వుల్లో పూలు పెట్టి…ఆకాశంపై ఉమ్మివేసే యత్నానికి దిగుతున్నారు. తాను ప్రాతినిథ్యం వహించిన ఐదో వార్డులో కనీసం ఒక్కరికైనా కేంద్రం స్కీమ్‌ల నుంచి సాయం అందించారో గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి కంటోన్మెంట్ ప్రాం తంపై చిత్తశుద్ధి ఉంటే ఒక్క పథకానైనా అమలు చేస్తే బాగుంటుందని పలువురు అభిపాయ్ర పడుతున్నారు.
మాజీలే..మరి మీరేంటి..!
ఆరేండ్ల పాటు బోర్డు సభ్యులుగా కొనసాగి వార్డుల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సభ్యులపై కమలం నేతలు అహంకార పూరితంగా వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో నిధుల లేకపోవడంతో అభివృద్ధి పనులు మందుకుసాగలేదు. ప్రస్తుతం బోర్డు సభ్యులుగా పదవీ కాలం పూర్తయినా మాజీలుగా వాళ్ల వార్డుల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూనే వస్తున్నారు. ఇప్పటికీ ఏ సమస్య వచ్చినా బోర్డుకు పరుగులు పెడుతూ అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తూనే ఉన్నారు. కానీ ఎన్నికల నిర్వహణను కూడా చేయలేని, చేవలేని స్థితిలో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఉంది. ఈ క్రమంలో పదవి లేకున్నా ప్రజల మధ్యలో ఉంటూ ఇటు రాష్ట్ర సర్కారు పథకాలను ప్రజల ధరికి చేర్చుతూ ముందుకుసాగుతున్నారు.
ఇటీవల కాలంలో నిధుల రాకతో గతంలో మంజూరైన అభివృద్ధి పనులు పట్టాలెక్కతున్న తరుణంలో వాటికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బస్తీవాసులు బోర్డు మాజీ సభ్యులను ఆహ్వానిస్తున్నారు. దీంతో జీర్ణించుకోలేని స్థితిలో కొంతమంది కమలం నేతలు మాజీలకు ఏం సంబంధం అంటూ దుర్భాషలాడుతున్నారు. ఇలాం టి నేతలు తాము ఏ పదవిలో ఉండి టెంకాయలు కొడుతున్నారో అర్థం చేసుకుంటే మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు. చూడాలి మరి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న కాషాయం నేతలపై జనం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే…!