సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని పరిష్కరించేందుకు త్వరలోనే మరో స్టీల్ బ్రిడ్జి అందులోబాటులోకి రానున్నది. జూబ్లీహిల్స్ రోడ్ నం.51లో రూ.23 కోట్ల అంచనా వ్యయంతో 290 మీటర్ల మేర జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వంతెన నిర్మాణంలో కీలకమైన పనులు ముగించుకుని రహదారి పనులు జరుగుతున్నారు. వారం రోజుల్లోగా ఈ పనులను పూర్తి చేసేలా జీహెచ్ఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ స్టీల్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు.
రోడ్డు నం.70 నుంచి 51ను కలుపుతూ..
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి అపోలో ఆసుపత్రికి వెళ్లే రోడ్డులో రెండో కుడివైపున రోడ్డు నంబర్ 70 ఉంటుంది. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల లోపలికి ప్రయాణిస్తే రోడ్డు నంబర్ 51కి చేరుకుంటాం. బాగా గుట్టలున్న ప్రాంతం కావడంతో ఈ రెండు రోడ్లు కలిసే చోట రహదారి బాగా లోతుగా ఉంది. దీంతో ఆ మార్గం గుండా ప్రయాణం కష్టతరంగా మారింది. కాగా రోడ్డు నంబర్ 51 నుంచి రాయదుర్గం వరకు అనుసంధానంగా (లింకు) రోడ్డు నిర్మిస్తున్నారు. పాత ముంబై హైవే నుంచి నగరంలోకి షార్ట్ కట్ దారి ఏర్పాటు చేయడంతో ఇటీవల రద్దీ బాగా పెరిగింది. సైలెంట్ వ్యాలీ కాలనీ వద్ద రహదారి ఓ పెద్ద కొండ నుంచి దిగినట్టుగా లోతుకు ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో వాహనదారులు అక్కడ ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎగుడు-దిగుడు తప్పిస్తూ సులువైన ప్రయాణానికి ఈ స్టీల్ బ్రిడ్జి దోహదపడనున్నది.