ఒక్క గది ఇల్లు ఉన్న పేద ప్రజలు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. తెలంగాణలో ఈ పరిస్థితి ఉండకూడదు. పేదలు ఆత్మగౌరవంతో నివసించేలా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగాలి. ఇందుకోసం ఖర్చుకు వెనుకాడం. ఐడీహెచ్ కాలనీ ఆదర్శంగా ఉండాలి.
– సీఎం కేసీఆర్
సనత్‌నగర్ నియోజకవర్గం, బన్సీలాల్‌పేట్ డివిజన్, బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో యాభై ఏండ్ల క్రితం ఆనాటి సర్కారు నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరాయి. ఇటుకలు కనిపించేలా గోడలు, పెచ్చులూడిన పైకప్పులు.. శిథిలాలు మీడపడి చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇక వానపడిందంటే వారికి జాగారమే. బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు.. ఏ దేవుడైనా కరుణించక పోతాడా అని ఎదురుచూస్తున్న వారి వద్దకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లారు. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తూ పేదలకు ఉచితంగా అందించేందుకు 396 డబుల్ బెడ్ రూం ఇండ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఐడీహెచ్ కాలనీతో పాటు సుభాశ్ చంద్రబోస్ నగర్, భగత్‌సింగ్‌నగర్, అమ్ముగూడ, పార్థీవాడలను కలిపి ఎవరూ ఊహించని రీతిలో దేశంలోనే తొలి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీగా రికార్డు సమయంలో కేవలం 13 మాసాలలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు.అంతే కాకుండా 16 దుకాణాలను నిర్మించి స్థానికులకు ఉపాధి కల్పించారు. బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. పిల్లల కోసం పార్కును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఎందరో ప్రతినిధులు వచ్చి ఈ కాలనీని చూసి ప్రశంసలు కురిపించారు.
ఐడీహెచ్ కాలనీ నేపథ్యం..
స్వాతంత్య్రానంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న బోయిగూడ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు భోలక్‌పూర్ గ్రామ సరిహద్దులో ఇన్ఫెక్షన్ డిసీజ్ హాస్పిటల్ (ఐడిహెచ్) పేరుతో 1950లో కోరంటి దవాఖానను ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రికి నిర్వహణను అప్పటి సికింద్రాబాద్ నగర పాలక సంస్థ చేపట్టింది. దాని పక్కనే ఉన్న ఆరు ఎకరాల స్థలంలో స్లమ్ క్లియరెన్స్ స్కీమ్‌లో భాగంగా 11 బ్లాకులలో 360 ఇండ్లను నిర్మించిన బల్దియా, నామమాత్రపు అద్దెలను వసూలు చేసింది. కొన్నేండ్ల తరువాత ఐడీ హాస్పిటల్ మూతపడింది. దవాఖానా నిర్వహించిన భవనాన్ని మదర్ థెరిసా ఆధ్వర్యంలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు అప్పగించారు. అందులో అనాథ, వృద్ధుల ఆశ్రమం నడుస్తున్నది. 40 ఏండ్ల అనంతరం ఇండ్లన్నీ శిథిలావస్థకు చేరి పైకప్పుల పెచ్చూలూడిపడి స్థానికులు చనిపోవడంతో బస్తీవాసులు భయాందోళనకు గురి అయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలో..
2001లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వారందరికీ పట్టాలను ఇప్పించారు. వాంబే పథకం కింద నూతన ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదట నిర్మాణం చేపట్టిన 10 నెంబరు బ్లాకులోని 36 ఇండ్లు పూర్తి కావడానికి నాలుగేండ్లు పట్టింది. ఆ తరవాత 4,5,6 నెంబరు బ్లాకుల నిర్మాణం పూర్తి కావడానికి మరో నాలుగేండ్లు పట్టింది. అంటే 144 ఇండ్లను పునర్ నిర్మించడానికి 8 సంవత్సరాలు పట్టింది. 2009లో సాధారణ బోయిగూడ సికిందరాబాద్ నుంచి సనత్‌నగర్ నియోజకవర్గంలోకి మారింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాలనీలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా జీ ప్లస్ 3 కింద నూతన ఇండ్లను నిర్మించడానికి హడావుడిగా శంకుస్థాపన కూడా చేసేసారు. అయితే బస్తీవాసులు అంగీకరించలేదు.
స్వరాష్ట్రంలో.. కల సాకారం
2014లో తెలంగాణ ఏర్పడింది. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్న ఐడీహెచ్ కాలనీ వాసుల కష్టాలను తీర్చడానికి దేవుడిలా వచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి బస్తీవాసుల కష్టాలను చూసి చలించిపోయారు. పోరాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో పేదల జీవితాలను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికప్పడే అధికారులతో మాట్లాడి, కాలనీవాసులందరికీ డబుల్ బెడ్రూమ్లతో కూడిన ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తామని ప్రకటించారు. కేవలం ఐడీహెచ్ కాలనీ మిగిలిన 216 మాత్రమే కాకుండా వాటి పక్కనే ఉన్న అమ్ముగూడ హట్స్, పార్థీవాడ, సుభాశ్ చంద్రబోస్ నగర్, భగత్‌సింగ్ నగర్ బస్తీలకు చెందిన గుడిసెలను, రేకుల ఇండ్లను కూడా తొలగించి, మొత్తంగా ఒక మోడల్ కాలనీ నిర్మాణానికి 3వ తేదీ అక్టోబరు 2014 దసరా పండగ రోజున 396 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రికార్డు స్థాయిలో మరుసటి ఏడాది దసరా నాటికల్లా డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు అందజేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
మా ఐడీహెచ్ కాలనీకి ఎందరో వచ్చారు. చూసి వెళ్లిపోయారు తప్ప మాపై కరుణ చూపలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మా బస్తీవాసులను తీసుకెళ్లి సీఎం కేసీఆర్‌కు సమస్య వివరించగానే ఆయన స్వయంగా వచ్చి మా బాధలు చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని ప్రకటించి, మాట నిలబెట్టుకున్నారు. 14 నెలల్లో ఇండ్లు నిర్మించి మాకు అందించారు. అల్లా దయ వలన సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము.
-మహ్మద్ మునీర్
సీఎం కేసీఆర్ వల్లే ఆనందంగా ఉన్నాం
ఈ రోజు మేము ఆనందంగా ఉండడానికి సీఎం కేసీఆరే కారణం. ఎప్పుడు మాపై పెచ్చులూడి పడతాయోననే భయంతో నిదురపట్టేది కాదు. అలాంటి మాకు అన్ని సదుపాయాలతో కూడిన అద్భుతమైన ఇండ్లను కట్టించి ఇచ్చిన సీఎం కేసీఆర్ ఎల్లప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో, నిండు నూరేండ్లు సుఖంగా జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము.
– నళిని
మనసున్న ముఖ్యమంత్రి
గరిబోళ్ల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ మా వద్ద నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా 396 ఇండ్లను నిర్మించి ఇచ్చారు. మేము పడిన బాధలు చూసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి మా కష్టాలు వివరించారు. పేదల హృదయాలలో స్థానం సంపాదించుకున్న ఇలాంటి మనసున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలో నిలిచిపోతారు. కుటుంబమంతా ఈ రోజు సంతోషంగా ఉండడానికి కారకుడైన సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాము.
– మాణిక్యం