మేడ్చల్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): ఐటీ పార్కు ఏర్పాటు కానున్న మేడ్చల్ ప్రాంతం అభివృద్ధిలో మరింత దూసుకుపోవడం ఖాయమని, ఐటీ పార్కు శంకుస్థాపన సందర్భంగా ఈ నెల 17న మంత్రి కేటీఆర్ చేపడుతున్న పర్యటనను విజయవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి పర్యటన సోమవారం మేడ్చల్‌లో మండల టీఆర్ఎస్ నాయకులతో సన్నాహక సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిరంతరం ప్రజల కోసమే పని చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, నగర నలుమూలలా అభ్యున్నతికి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. అందులో భాగంగానే కండ్లకోయలో ఐటీ పార్కు ఏర్పాటుకు పూనుకున్నారని పేర్కొన్నారు. ఈ నెల 17న మేడ్చల్ ఐటీ పార్కు నిర్మాణ పనుల ప్రారంభంతో పాటు మండలంలోని పూడూర్ గ్రామంలో రూ.5 కోట్ల నిధులతో నిర్మించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమానికి మండలం నుంచి యువకులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. అందుకు నాయకులు ఇప్పటి నుంచే కృషి చేయాలని సూచించారు. ప్రజలతో మమేకమై పని చేసిన వారే నాయకులుగా ఎదుగుతారని అన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడాలని సూచించారు. అనంతరం, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో నగర శివారులోని మేడ్చల్ నియోజకవర్గ రైతులకు మేలు జరుగుతుందని హితవు పలికారు.