కీసర, నవంబర్ 14: కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కార్తిక మాసోత్సవంలో భాగంగా శివ భక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్టకు విచ్చేసి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శంభో శంకర.. హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో కేసరిగిరి మారుమోగింది. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి పంచామృతంతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. భక్తులు భారీగా విచ్చేసి ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఓపికగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కాశీవిశ్వేరాలయం, లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, శ్రీ నాగదేవతను దర్శించుకున్నారు.
అనంతరం రాజగోపురం ముందున్న శివలింగాలకు భక్తులు అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం హుడాపార్కులో సేదా తీరారు. కార్యక్రమం లో ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు బోడుసు రమేశ్‌యాదవ్, ఆర్.శ్రావన్కుమార్గుప్తా, రామిడి మల్లారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.