ఖైరతాబాద్, ఫిబ్రవరి 7 : సామాన్యుల వైద్యం కోసం ఖైరతాబాద్‌లో నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని వారం రోజుల్లో ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. సోమవారం వాసవీ ఆస్పత్రిలో కార్డియో థోరాసిక్ విభాగాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. చాలా కాలం క్రితం ఖైరతాబాద్‌లో నిర్మించిన ఏరియా ఆస్పత్రిని ప్రారంభించి స్థానిక ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే దానం నాగందర్, కార్పొరేటర్ పి. విజయారెడ్డి తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్యాన్ని ప్రజల వద్దకే చేర్చే విధంగా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిందన్నారు. ఖైరతాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్,ఐసీయూ పడకలతో పాటు అన్ని రకాల ఆధునీక పరికరాలు అందించామన్నారు. వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, అయినా ప్రజలు మాస్కులు ధరించడంతో పాటు, శానిటైజర్స్ వినియోగించాలన్నారు. అవసరమైన వారు బూస్టర్ డోసులు వేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వైల ప్రవీణ్ కుమార్, వనం శ్రీనివాస్ యాదవ్, కరాటే రమేశ్, శ్రీనివాస్ యాదవ్, మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.