సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): అతిపెద్ద మేడారం జాతరకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నది. ఎలాంటి అదనపు డిపాజిట్ లేకుండా కనీసం 30 మంది భక్తులుంటే ప్రత్యేక బస్సును బుక్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోనల్ అధికారులు కల్పించారు. భక్తుల నివాస స్థలం నుంచి సమ్మక్క, సారలమ్మ గద్దెల వరకు ఈ బస్సులను నడుపుతున్నట్లు.. ఈ అవకాశాన్ని జాతరకు వెళ్లే భక్తులందరూ వినియోగించుకోవాలని ఆర్టీజీ జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి వివరాలకు www.tsrtconline.in, http://www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు. లేదా దగ్గరలోని బస్‌డిపో మేనేజర్లను సంప్రదించవచ్చన్నారు. అంతేకాక వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్లే వారు సైతం ప్రత్యేక బస్సులను బుక్ చేసుకోవచ్చన్నారు.
సరుకు రవాణాలో ఎస్సీఆర్ పురోగతి
దక్షిణ మధ్య రైల్వే అనేక మైలురాళ్లను అధిగమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి వరకు 96.3 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసినట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం అధికమన్నారు. అలాగే ఈ సంవత్సరం జనవరిలో అత్యధికంగా 10.9 మిలియన్ టన్నుల లోడింగ్ చేయగా.. ఇందులో ఆహార ధాన్యాలతో పాటు బొగ్గు, సిమెంట్, ఎరువులు, కంటైనర్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.