అబిడ్స్, ఫిబ్రవరి 6 : ఆస్తి పన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను పరిష్కార వేదికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రారంభమైన వేదికలు మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మొదలుకుని మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లింపులో ఏవైనా అసమానతలు ఉ న్నా, నివాసం ఖాళీగా ఉన్న వారు ఈ సమావేశాల్లో పరిష్కరించుకునేందుకు ఆస్కారం ఉంది. ఇందుకు గాను సమావేశాలలో ప్రత్యేకంగా దరఖాస్తులను అధికారులు స్వీకరించి పరిష్కారం కనుగొంటారు.
మార్చి 31 గడువు తేదీ కావడంతో ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసేందుకు గాను అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ఆస్తి పన్ను పరిష్కార వేదిక స మావేశాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం జరిగిన ఆస్తి పన్ను పరిష్కార వేదికలో 26 దరఖాస్తులు అందాయి. అందిన దరఖాస్తులను జీహెచ్ఎంసీ పద్నాల్గవ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసు నేతృత్వంలో అక్కడికక్కడే పరిష్కారమయ్యే వాటిని పరిష్కరించారు. మిగిలిన వాటిని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో ఏడు ఆదివారాలు పన్ను పరిష్కార వేదికలను నిర్వహించనున్నారు.
ఏ విధమైన సమస్య ఉన్నా పరిష్కరించుకోవచ్చు..
ఆస్తి పన్ను చెల్లింపులో భాగంగా ప్రతి ఆదివారం నిర్వహించే పరిష్కార వేదికలో భవనాల యజమానులు పాల్గొనవచ్చు. పన్ను చెల్లింపులో ఉన్న సమస్యల గురించి అధికారులతో చర్చించి పరిష్కరించుకోనున్నారు. ప్రతి ఆదివారం కార్యాలయానికి విచ్చేసి అధికారులకు సమస్యలను వివరించవచ్చు. అధికారులు అవగాహన కల్పించి పరిష్కరిస్తారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని పరిష్కరించి, పరిష్కరించలేని సమస్యలకు విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటారు.
– బి.శ్రీనివాసు, డిప్యూటీ కమిషనర్
మార్చి 31 వరకు నిర్వహించే వేదికలకు సమస్యలున్న భవన యజమానులు రావాలి..
ఆస్తి పన్ను పరిష్కార వేదికలను ఆదివారం ప్రారంభం కాగా మార్చి 31 వరకు మరో ఏడు ఆదివారాలు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఆస్తి పన్ను చెల్లింపు విషయంలో భవన యజమానులకు ఎలాంటి అభ్యంతరాలున్నా ఆస్తి పన్ను పరిష్కార వేదికలలో దరఖాస్తు చేసుకోవచ్చు. అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది.