మారేడ్‌పల్లి, ఫిబ్రవరి 5: మోండా డివిజన్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ముమ్మరంగా జ్వర సర్వే కొనసాగుతున్నది. బస్తీ, కాలనీల్లో జీహెచ్ఎంసి సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు డివిజన్లో 12,328 మందిని సర్వే చేసి, 150 మందికి హోమ్ ఐసొలేషన్ కిట్లు అందజేసినట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రవీణ్ తెలిపారు. డివిజన్లోని మారేడ్‌పల్లి, అంబేద్కర్‌నగర్, జేపీ నగర్, టీచర్స్‌కాలనీ, మోండామార్కెట్, రెజిమెంటల్‌బజార్, శివాజీనగర్, నాలాబజార్‌లో ఇప్పటికే సర్వే చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో డివిజన్లో పూర్తవుతుందని అధికారులు తెలుపుతున్నారు.
ఇంటింటికీ వెళ్లి సర్వే..
జ్వర సర్వేలో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేసుకున్నారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం, జలుబు ఉంటే వెంటనే వారికి మందుల కిట్లను అందజేస్తున్నారు. ఈ సర్వేపై ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెండో డోస్ తీసుకోని వారెవరైనా ఉంటే వివరాలు నమోదు చేసుకుని టీకా వేయించుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మారేడ్‌పల్లి కస్తూర్బా గాంధీ డిగ్రీ కళాశాలలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు రెండో డోస్ వ్యాక్సినేషన్ వేశారు.