కరీంనగర్/హుజూరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉపఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఓటు హక్కును వినియోగించుకొన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈసారి 86.33 % (కడపటి వార్తలు అందిన సమాచారం మేరకు) నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్ గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం సమయంలో బాగా పెరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకొన్నారు. నిజానికి హుజూరాబాద్‌లో గతంలోనూ ఇతర నియోజకవర్గాలతో పోల్చితే పోలింగ్ అధికంగా ఉండేది. అదే చైతన్యాన్ని ఈసారి కూడా ఓటర్ల చూపించారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అధికారుల అంచనాల ప్రకారం 85% అయ్యే అవకాశాలున్నాయని అంచనాలు వేయగా, దానికి మించి పోలింగ్ జరిగింది.
నియోజకవర్గంలో మొత్తం 2,37,022 ఓట్లు ఉండగా ఇందులో 1,17,922 మంది పురుషులు, 1,19,099 మంది మహిళలున్నారు. ఒకరు ఇతరులున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరిగింది. కరోనా నిబంధనల మేరకు ఈ ప్రక్రియ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు చలి ఎక్కువగా ఉండడంతో మందకొడిగా సాగింది. తొమ్మిది గంటల నుంచి ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాత్రి ఏడు గంటల వరకు ఇదే తరహాలో కొనసాగింది. ఉపాధి, ఇతర అవసరాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం భారీగా తరలి వచ్చి ఓటువేశారు. పలు పోలింగ్ కేంద్రాల దగ్గర బీజేపీ నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. టీఆర్ఎస్ శ్రేణులను, సామాన్య ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. వ్యక్తిగత పనులపై బయటికి వచ్చినవారి వాహనాలను అడ్డుకొని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై హుజూరాబాద్ ఓటర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. పెరుగుతున్న వంట గ్యాస్ ధరలకు నిరసనగా మహిళలు సిలిండర్‌కు దండం పెట్టి ఓటు వేసేందుకు వెళ్లారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ దంపతులు వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఓటువేశారు. గెల్లు శ్రీనివాస్ ఓటువేయడానికి ముందు తన ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి పోలింగ్‌కేంద్రానికి వచ్చారు. పొద్దున హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. పలు పోలింగ్ కేంద్రాల్లో గెల్లు శ్రీనివాస్ ఓటర్ల సరళిని పరిశీలించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) శశాంక్ గోయల్ హుజూరాబాద్, కమలాపూర్‌లోని పలు కేంద్రాలను పరిశీలించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు గోయల్ వెంట ఉన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మోరాయించినా వెంటనే సరిచేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్ తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదైందని, తుది నివేదికల తర్వాత మరింత పెరిగే అవకాశమున్నదని చెప్పారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమలాపూర్‌లో 224, 225 పోలింగ్‌కేంద్రాల్లో సమయం దాటిన తర్వాత కూడా ఓటర్లు బారులు తీరారని చెప్పారు. పోలిం గ్ ముగిశాక పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్‌వేసి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచామన్నారు. స్ట్రాంగ్‌రూంకు చుట్టూ 19 కంపెనీల పారామిలిటరీ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని వివరించారు. ఈవీఎంలను పోటీచేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలో పెట్టిన తరువాత ఆ గదికి సీల్‌వేసి కౌంటింగ్ రోజు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో తెరుస్తామన్నారు. ఈ స్ట్రాంగ్ రూం, పరిసరాల్లో 24 గంటల నిఘా ఉంటుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు డబ్బులు పంపిణీచేశాయనే ఫిర్యాదు అందాయని, వీటిపై విచారణ చేపడతామని చెప్పారు. రూ.3.6 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్‌చేశామని తెలిపారు.