ఎల్కతుర్తి, జనవరి 2: భార్య మృతిని తట్టుకోలేక భర్త గంటల వ్యవధిలోనే కన్నుమూశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కేశవపూర్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన ఎడవెల్లి మధురమ్మ (70), రాంరెడ్డి (75) దంపతులు. కూతురు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మధురమ్మ శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు వెళ్లింది. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత రాత్రి 10:30 గంటల సమయంలో మధురమ్మ అకస్మాత్తుగా మృతిచెందింది. విషయం తెలిసి ఆందోళనకు గురైన భర్త రాంరెడ్డి అర్ధరాత్రి తర్వాత గుండెపోటుతో మరణించాడు. గంటల వ్యవధిలో భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.