బిజినేపల్లి : భూ సమస్యలు ( Land Issue) పెండింగ్‌లో ఉండడం వల్ల వారసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా సమస్యను పరిష్కరించాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకునే నాథులు లేకపోవడంతో భార్యాభర్తలు సుమారు 30 కి.మీటర్లుపైగా నడుచుకుంటూ కలెక్టరేట్‌కు మండుటెండలో పాదయాత్రగా బయలు దేరారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం( Bijinepalli ) బొరుసు గడ్డ గ్రామపంచాయతీ పరిధిలో ఇప్పల తండాకు చెందిన రవి( Ravi ), గీతా( Geeta ) అనే భార్య భర్తలు ఇద్దరూ తమ తండా నుంచి సోమవారం పాదయాత్రగా కలెక్టరేట్‌కు నడుచుకుంటూ బయలు దేరారు. గ్రామ శివారులోని 243 సర్వే నెంబర్లో మొదట నాలుగు ఎకరాల 25 గుంటలు భూమి ఉండేదని వారు వివరించారు.
రోడ్డుకు ఇరవై ఐదు గుంటలు పోగా మరో ఎకరా ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్ముకున్నానని తెలిపారు. ఇప్పుడు మొత్తం మూడు ఎకరాల భూమి ఉండాల్సింది. మోకాపై కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఉందని అన్నారు. ఆన్లైన్లో , పాసుబుక్‌లో మాత్రం మూడు ఎకరాల భూమి ఉందని తెలిపారు. మరో ఎకర భూమి మోకా పైన తమకు చూయించాలని కార్యాలయాల చుట్టు తిరిగినా లాభం లేకుండా పోయిందన్నారు.ఈ భూమి విషయమై గతంలో కలెక్టరేట్లోని ప్రజావాణి, స్థానిక పోలీస్ స్టేషన్, తహసీల్ కార్యాలయాతో ఇతర ఉన్నత అధికారులకూ ఫిర్యాదు చేసిన లాభం లేకుండా పోయిందన్నారు. తమ భూమి తమకు ఇప్పించాలంటూ పాదయాత్రగా కలెక్టరేట్ కార్యాలయానికి బయలు దేరామని వెల్లడించారు.