సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 8: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదం చేస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఆదివారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందన్నారు.
జిల్లాలోని 15 ఏండ్లలోపు బాలికలకు జనరల్ దవాఖాన, ఏరియా దవాఖానల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 14 నుంచి 15 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న దాదాపు 12,500 మంది బాలికలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు. ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆయా బాలికలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నట్లు వివరించారు. క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు, వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.