Water | ఆరోగ్యంగా ఉండాలంటే వేళకు తగిన పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు రోజూ వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతోపాటు రాత్రి పూట తగినన్ని గంటల పాటు నిద్రించాల్సి కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కాకుండా రోజూ తగినంత మోతాదులో నీళ్లను కూడా తాగాలి. అప్పుడే జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే రోజుకు అసలు ఎన్ని నీళ్లను తాగాలి..? అనే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇందుకు వైద్యులు సరైన సమాధానం చెబుతున్నారు. వారు ఏమంటున్నారంటే.. ఎవరైనా సరే తమ శరీర బరువును బట్టి రోజుకు నిర్దిష్టమైన మోతాదులో నీళ్లను తాగాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
సాధారణంగా ఒక కిలో శరీర బరువుకు సుమారుగా 40 ఎంఎల్ వరకు నీళ్లను తాగాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు 50 కిలోల బరువు ఉన్నవ్యక్తి 50*40=2000 ఎంఎల్ అంటే సుమారుగా 2 లీటర్ల నీళ్లను రోజుకు తాగాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఎవరికి వారు తమ శరీర బరువుకు ఎన్ని నీళ్లను తాగాలో లెక్కించి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నీళ్లను తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అయితే వ్యాయామం చేసేవారు లేదా శారీరక శ్రమ చేసేవారు తమ శరీర బరువు ప్రకారం నీళ్లను తాగడంతోపాటు అదనంగా మరో లీటర్ నుంచి 2 లీటర్ల వరకు నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. నీరసం, అలసట రాకుండా అడ్డుకోవచ్చు. ఇక వేడి వాతావరణంలో ఉండే వారు సాధారణం కన్నా కాస్త ఎక్కువగానే నీళ్లను తాగాలి.
జ్వరం వచ్చినవారు, వాంతులు, విరేచనాలు అవుతున్నవారు అధిక మొత్తంలో నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరం కోల్పోయిన ద్రవాలను, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందడంతోపాటు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అయితే మీ మూత్రం రంగును బట్టి కూడా మీరు నీళ్లను ఎక్కువగా తాగుతున్నారా, తక్కువగా తాగుతున్నారా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. నీళ్లను సరైన మోతాదులో తాగితే మూత్రం లేత పసుపు రంగులో వస్తుంది. మరీ అతిగా నీళ్లను సేవిస్తే మూత్రం కాస్త తెలుపు రంగులో ఉంటుంది. అదే నీళ్లను సరిగ్గా తాగకపోతే ముదురు పసుపు రంగు లేదా గోధుమ రంగులో మూత్రం వస్తుంది. అలాగే మూత్రం దుర్వాసన కూడా వస్తుంది. దీన్ని బట్టి మీరు నీళ్లను తగినంత మోతాదులో తాగుతున్నారా, లేదా అన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది.
ఇక నీళ్లను తగినంత మోతాదులో రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. దీని వల్ల నీరసం, అలసట రాకుండా ఉంటాయి. కీళ్లలో గుజ్జు సరిగ్గా ఉండి కదలికలు మెరుగ్గా ఉంటాయి. దీంతో కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుని శరీర భాగాలకు అందజేస్తుంది. దీని వల్ల పోషకాహార లోపం రాకుండా చూసుకోవచ్చు. కండరాలు ప్రశాంతంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు పట్టుకుపోకుండా, నొప్పులు రాకుండా చూసుకోవచ్చు. నీళ్లను రోజూ తగిన మోతాదులో తాగుతుంటే శరీర మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. సాధారణంగా చాలా మంది నీళ్లను సరిగ్గా తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి తలనొప్పి వస్తుంది. మీకు కూడా తరచూ తలనొప్పి వస్తుంటే మీరు నీళ్లను తగిన మోతాదులో తాగుతున్నారో లేదో గుర్తించండి. దీని వల్ల తలనొప్పికి అసలు కారణం తెలిసిపోతుంది. నీళ్లే కారణం అయితే నీళ్లను తగిన మోతాదులో తాగుతుంటే ఆ తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.
అలాగే నీళ్లను సరైన మోతాదులో తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. పేగుల్లో ఆహారం కదలికలు సరిగ్గా ఉంటాయి. చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. తేమగా మారుతుంది. శరీరంలోని వ్యర్థాలను కిడ్నీలు సులభంగా బయటకు పంపిస్తాయి. దీంతో కిడ్నీలు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. నీళ్లను తగిన మోతాదులో రోజూ తాగడం వల్ల డీహైడ్రేషన్ రాకుండా అడ్డుకోవడంతోపాటు మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఇలా నీళ్లను రోజూ తగిన మోతాదులో తాగుతుంటే అనేక లాభాలను పొందవచ్చు.