Kiran Abbavaram | తెలుగు సినీ రంగంలో ఇటీవల జర్నలిస్టులు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తమ డ్రెస్సింగ్, వ్యక్తిగత విషయాలపై అడిగే ప్రశ్నలకు ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తుండగా, కొన్ని సందర్భాల్లో ప్రశ్నించే తీరే వివాదాలకు దారితీస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి డ్రెస్సింగ్‌పై ఓ సీనియర్ జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఆమెకు కోపాన్ని తెప్పించింది. వెంటనే అతడిని సూటిగా ప్రశ్నిస్తూ, ‘‘నీకు ఎంత ధైర్యం, ఇలాంటి ప్రశ్న అడగడానికి?’’ అంటూ బహిరంగంగానే గట్టిగా స్పందించింది. ఇంతటితో ఆగకుండా, జర్నలిస్ట్ తనను అవమానించేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆమె ఫిల్మ్ ఛాంబర్, జర్నలిస్ట్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశారు.
దాంతో ఆ జర్నలిస్టు బేషరతుగా క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేయడం ద్వారా ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇంతలోపే ఓ లేడీ జర్నలిస్టు తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్‌కి వేసిన ప్రశ్న విమర్శలకు కారణమైంది. మీరు లుక్ పరంగా హీరో మెటీరియల్ కాకపోయినా, రెండు సినిమాలకు ఈ స్థాయి సక్సెస్ రావడం అదృష్టమా లేక హార్డ్ వర్కా?’ అన్న ఆమె ప్రశ్న సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. ప్రదీప్ స్పందించేందుకు ప్రయత్నిస్తుండగానే పక్కనే ఉన్న శరత్‌కుమార్ స్పందిస్తూ, ‘ఇక్కడున్న ప్రతివారూ హీరోలే. హీరో అనడానికి ఏదైనా లక్షణాలుండాలా? ఈ సమాజానికి మేలు చేసే ప్రతి వ్యక్తి హీరోనే’’ అని సమాధానం ఇచ్చారు. ఆమె అడిగిన ప్రశ్నపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ, వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు అంటూ నెగటివ్ కామెంట్ల వర్షం కురిపించారు.
ఇక ‘కే ర్యాంప్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అదే లేడీ జర్నలిస్ట్ మరోసారి ప్రదీప్ ఇష్యూ గురించి ప్రస్తావించగా, హీరో కిరణ్ అబ్బవరం సూటిగా స్పందించారు. ‘‘పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోని కించపరచడం కరెక్ట్ కాదు. అలాంటి ప్రశ్నలు అడగడం బాధాకరం. ప్రదీప్‌ని హీరో మెటీరియల్ కాదంటూ వ్యాఖ్యానించడం తగదు. మనది మనం చూసుకోవాలి, కానీ ఇలాంటివి వద్దు’’ అని స్పష్టం చేశారు. ప్రదీప్‌ని హీరో మెటీరియల్ కాదు అని మీరు అనడం చూస్తున్న నాకే బాధగా అనిపించింది. ఆయన ఇంకెంత బాధపడి ఉంటారు. ఇకపై అలాంటి ప్రశ్నలు అడగకండి’ అని చెప్పారు. కిరణ్ ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ప్రదీప్‌కి వేసిన ప్రశ్నపై సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కూడా స్పందిస్తూ, శరత్‌కుమార్ సమాధానాన్ని హైలైట్ చేస్తూ వీడియోను ట్వీట్ చేశారు.‘‘ఇది ఓ ప్రశ్నా? శరత్, ప్రదీప్ బాగా చెప్పారు’’ అంటూ రిపోర్టర్ వైఖరిని ఖండించారు.