Katy Perry | హాలీవుడ్ పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. కాలిఫోర్నియా తీరంలో ఒక విలాసవంతమైన యాచ్ (Yacht) లో వీరిద్దరూ సన్నిహితంగా.. ముద్దులు పెట్టుకుంటూ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శాంతా బార్బరా తీరంలో కేటీ పెర్రీకి చెందిన ‘కారావెల్’ అనే యాచ్‌పై ఈ జంట కన్పించింది. 40 ఏళ్ల కేటీ పెర్రీ నలుపు రంగు స్విమ్‌సూట్‌లో ఉండగా 53 ఏళ్ల జస్టిన్ ట్రూడో షర్ట్‌లెస్‌గా జీన్స్‌లో ఉన్నారు. యాచ్ డెక్‌పై ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఆప్యాయంగా ముద్దులు పెట్టుకుంటున్న దృశ్యాలను అక్కడికి సమీపంలో ఉన్న వేల్ వాచింగ్ పడవలోని పర్యాటకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ట్రూడో చేతిపై ఉన్న టాటూ ఆధారంగా అతన్ని వెంటనే గుర్తించగలిగామని పర్యాటకులు తెలిపారు. జస్టిన్ ట్రూడో, కేటీ పెర్రీ మధ్య సంబంధం గురించి గత కొద్ది నెలలుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 2025 జూలైలో ఈ ఇద్దరూ కెనడాలోని మాంట్రియల్లో జరిగిన ఓ ప్రైవేట్ డిన్నర్ డేట్లో కలుసుకున్నారు. అప్పటి నుంచే వీరి డేటింగ్ వదంతులు మొదలయ్యాయి. జస్టిన్ ట్రూడో 2023 ఆగస్టులో తన 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ తన భార్య సోఫీ గ్రెగోయిర్తో విడాకులు తీసుకున్నారు. అదేవిధంగా కేటీ పెర్రీ కూడా ఈ ఏడాది ప్రారంభంలో నటుడు ఓర్లాండో బ్లూమ్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, యాచ్‌లో ఈ ఇద్దరి సన్నిహిత దృశ్యాలు వీరి రొమాంటిక్ సంబంధాన్ని దాదాపుగా ధృవీకరించినట్లేనని హాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై కేటీ పెర్రీ లేదా జస్టిన్ ట్రూడో అధికారికంగా స్పందించాల్సి ఉంది.