Masala Tea | మసాలా టీ.. ఈ పేరు చెప్పగానే టీ ప్రేమికులకు నోట్లో నీళ్లూరతాయి. టీ తాగే చాలా మంది మసాలా టీని ఇష్టపడతారు. ఇందులో అనేక రరాల మసాలాలను, పాలు, చక్కెర వంటివి కలుపుతారు. కనుక మసాలా టీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక వాతావరణం చల్లగా ఉంటే మసాలా టీని ఎక్కువగా సేవిస్తుంటారు. అయితే మసాలా టీ ఎంతో రుచిగా ఉండడమే కాదు, మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మసాలా టీని ఈ సీజన్లో తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. సాధారణంగా మసాలా టీ అంటే బయట హోటల్స్ లేదా బండ్లపై మాత్రమే చక్కని రుచితో లభిస్తుందని అనుకుంటారు. కానీ కాస్త శ్రమిస్తే మసాలా టీని ఇంట్లోనే ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. పైగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ టీని తయారు చేసుకుని ఆస్వాదించవచ్చు. ఇక మసాలా టీని ఎలా తయారు చేయాలో, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, ఈ టీని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా టీ తయారీకి గాను 1 కప్పు నీళ్లను, 1 కప్పు పాలను, 2 టీస్పూన్ల టీ పొడిని, 2 టీస్పూన్ల చక్కెర లేదా బెల్లం లేదా తేనెను, అర ఇంచు అల్లం ముక్క, 3 లేదా 4 యాలకులు, 2 లేదా 3 లవంగాలు, అర ఇంచు దాల్చిన చెక్క ముక్కను తీసుకోవాలి. అవసరం అనుకుంటే నల్ల మిరియాలు, సోంపు గింజలు, జాజికాయ పొడి, అనాస పువ్వులను కూడా వేసుకోవచ్చు. దీంతో టీ రుచి మరింత పెరుగుతుంది. ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇక మసాలా టీని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు గింజలు, అనాస పువ్వును తీసుకుని మెత్తని పొడిలా పట్టుకోవాలి. అనంతరం ఒక పాత్రను తీసుకుని అందులో నీళ్లను పోసి అందులోనే అల్లం ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని వేసి మరిగించాలి. స్టవ్‌ను సిమ్‌లో పెట్టి నీళ్లు బాగా మరిగేలా చూడాలి. తరువాత టీ పొడి వేసి కలిపి అనంతరం పాలను పోయాలి. తరువాత స్టవ్‌ను మీడియం మంటపై ఉంచి 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం అందులో చక్కెర లేదా బెల్లం కలపాలి. తేన కలపాలనుకుంటే టీ మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి టీని వడకట్టాలి. అనంతరం అందులో తేనె కలపాలి. ఇలా చేస్తే మసాలా టీ సిద్ధమవుతుంది. దీన్ని వేడిగా తాగేయాలి.
మసాలా టీ తయారీలో అనేక రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తారు కనుక ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కనుక ఈ టీని తాగితే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మసాలా టీ తయారీలో వాడే అల్లం శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. వికారం నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ టీ తయారీలో వాడే దాల్చిన చెక్క వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాలకుల వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాల బయటకు వెళ్లిపోతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. లవంగాల వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
ఈ టీ తయారీలో ఉపయోగించే నల్ల మిరియాలలో పైపరైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీని వల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ముక్కు దిబ్బడ తగ్గిపోయేలా చేస్తుంది. ఈ టీని సేవించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ టీని సేవిస్తుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ లేదా కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ టీని సేవిస్తుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. చల్లని వాతావరణంలో ఈ టీని సేవించడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. చలి నుంచి రక్షణ పొందవచ్చు. ఇలా మసాలా టీని సేవిస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు.