Pak vs Afg : పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ (Pakistan-Afghanistan) బలగాల మధ్య భారీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఖైబర్ పఖ్తుంక్వా, బలూచిస్థాన్-డాన్ సరిహద్దుల్లో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలువురు పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్లు సమాచారం. శనివారం రాత్రి పాక్ సరిహద్దుల వెంట తాలిబన్ బలగాలు కాల్పులు జరిపాయి. అనంతరం ఆఫ్ఘన్ సరిహద్దులు లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు దిగింది.
ఇటీవల కాబూల్పై పాకిస్థాన్ వైమానిక దాడులకు స్పందనగా తాము ప్రతీకార దాడులకు పాల్పడినట్లు ఆఫ్ఘన్ పేర్కొంది. గురువారం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్లో తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపించారు.
ఈ దాడులకు ప్రతీకారంగా ప్రస్తుతం తాలిబన్ దళాలు సరిహద్దుల వెంబడి దాడులు చేపట్టినట్లు ఆఫ్ఘన్ అధికారులు వెల్లడించారు. పాక్ బలగాలు నిబంధనలను ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు దాడులను మరింత ఉద్ధృతం చేస్తాయని హెచ్చరించారు. ఇటీవల ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబుల్లో భారీ పేలుళ్లు కలకలం సృష్టించాయి.
టీటీపీ చీఫ్ నూర్ వాలి మెహసూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు పాకిస్థాన్ రక్షణ సంస్థల కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ దాడులపై పాకిస్థాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు వచ్చారు. ఈ దాడులు జరగడం గమనార్హం. కాగా టీటీపీ చీఫ్ లక్ష్యంగా దాడులు చేయడాన్ని దాని అనుబంధ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి.