Diane Keaton | హాలీవుడ్ సినీ చరిత్రలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ నటి, ఆస్కార్ విజేత డయాన్ కీటన్ (Diane Keaton) 79 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచింది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డయనా శనివారం కన్నుమూసినట్లు సమాచారం. ఇక డయనా మరణవార్త తెలుసుకున్న హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగిన డయాన్ కీటన్.. గొప్ప నటిగా, స్టైల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు. ఆమె నటించిన ‘యాన్ హాల్’ (Annie Hall) చిత్రానికిగాను ఆమెకు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘ది గాడ్‌ఫాదర్’ (The Godfather) సిరీస్‌లో ‘కే ఆడమ్స్-కార్లియోన్’ పాత్ర ఆమెకు గ్లోబల్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆమె ధరించే ప్రత్యేకమైన సూట్లు, టోపీలు ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్‌గా మారాయి.
డయాన్ కీటన్ మరణంపై హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో సంతాపం తెలుపుతూ.. డయాన్ కీటన్ మరణవార్త విని నా హృదయం బద్దలైంది. ఆమెతో కలిసి పనిచేసిన ప్రతి క్షణం ఒక అద్భుతమైన జ్ఞాపకం. ఆమె చిరకాలం మా స్మృతుల్లో ఉంటారు అంటూ భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు. లియోతో పాటు మెరిల్ స్ట్రీప్, మార్టిన్ స్కోర్సెస్, స్టీవ్ మార్టిన్ వంటి ఎందరో దిగ్గజాలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.