చెన్నై : తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని బెంగళూరు – చెన్నై జాతీయ రహదారిపై ఒకేసారి ఐదు వాహనాలు ఢీకొన్నాయి. వేగంగా వెళ్తున్న ఓ కారు.. ట్రక్కును ఢీకొట్టింది. దీంతో దాని వెనుకాల ఉన్న మరో మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన కారు హోసూరు నుంచి కృష్ణగిరి వైపు వెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ రోడ్డు ప్రమాదంతో బెంగళూరు – చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మృతుల్లో ఒకరిని ముకిలాన్(30)గా గుర్తించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రయివేటు కోచింగ్ సెంటర్లో యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రిపేరవుతున్నట్లు తెలిసింది. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హోసూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు.