Apples | యాపిల్ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. యాపిల్ పండ్లలోనూ అనేక రకాలు ఉంటాయి. మనకు మన దేశంలో పండే యాపిల్స్‌తోపాటు విదేశీ యాపిల్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే యాపిల్ పండ్లను రోజూ తినడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదని అంటుంటారు. అయితే యాపిల్ పండ్లను నిజంగా రోజుకు ఒక్కటే తినాలా..? ఎక్కువ తినకూడదా..? యాపిల్ పండ్లలో ఉండే పోషకాలు ఏమిటి..? వీటి వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే వీటికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. షుగర్ లెవల్స్‌ను తగ్గించి డయాబెటిస్ అదుపులో ఉండేలా చేస్తుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ కారణంగా మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. యాపిల్ పండ్లలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలో ఉండే పెక్టిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. యాపిల్ పండ్లలో అధికంగా ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్ హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. యాపిల్ పండ్లు బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్, నీరు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
యాపిల్ పండ్లలో ఉండే ఫైబర్ కారణంగా మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారి రక్తంలో వేగంగా కలవకుండా నిరోధించవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రోజూ ఒక యాపిల్ పండును తినే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తేలింది. యాపిల్ పండ్లలో ఉండే పెక్టిన్ కారణంగా ఇది ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. అందువల్ల యాపిల్ పండ్లను తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. యాపిల్ పండ్లలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
యాపిల్ పండ్లను తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా మారుతారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. వృద్ధాప్యంలో అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఒక యాపిల్ పండులో 95 క్యాలరీల శక్తి ఉంటుంది. 25 గ్రాముల పిండి పదార్థాలు, 4.4 గ్రాముల ఫైబర్, 19 గ్రాముల సహజసిద్ధమైన చక్కెరలు, 0.5 గ్రాముల ప్రోటీన్లు, 0.3 గ్రాముల కొవ్వులు ఉంటాయి. యాపిల్ పండ్లను తినడం వల్ల అధిక మొత్తంలో విటమిన్లు సి, ఎ, కెలతోపాటు పొటాషియం వంటి పోషకాలను కూడా పొందవచ్చు. ఇక యాపిల్ పండ్లను రోజుకు ఒక్కటే తినాలా..? ఇంకా ఎక్కువ తినకూడదా..? అంటే.. సాధారణంగా రోజుకు 2 వరకు యాపిల్ పండ్లను తినవచ్చు. దీని వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలగవు. కానీ యాపిల్ పండ్లలో ఉండే ఫైబర్ కారణంగా ఈ పండ్లు కొందరికి సులభంగా జీర్ణం కావు. కనుక అలాంటి వారు యాపిల్ పండ్లను రోజుకు ఒకటి తింటే మంచిది. ఇలా ఈ పండ్లను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.