Lasoda Fruit | మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు లభిస్తుంటాయి. సీజనల్ పండ్లతోపాటు రెగ్యులర్గా లభించే పండ్లను చాలా మంది తింటుంటారు. అయితే కొన్ని రకాల పండ్లు చూసేందుకు విచిత్రంగా ఉంటాయి. అలాంటి పండ్లను తినేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ అవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటి పండ్లు కూడా మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో లసోడా అనే పండ్లు కూడా ఒకటి. వీటినే గుండా, డేలా, ఇండియన్ చెర్రీ అనే పేర్లతో పిలుస్తారు. ఈ పండ్లు మన దేశంలోపాటు ఆసియాలోని పలు ప్రాంతాల్లో పండుతాయి. పలు సంప్రదాయ వైద్య విధానాల్లోనూ ఈ పండును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. లసోడా పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
లసోడా పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. అజీర్తి నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. ఈ పండ్లను తింటుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. విరేచనాలు అయిన వారు ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే జీర్ణ సమస్య సైతం తగ్గిపోతుంది. లసోడా పండ్లను తింటే దగ్గు, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దీని వల్ల శ్వాస నాళాలు క్లియర్గా మారుతాయి. శ్వాస సరిగ్గా లభిస్తుంది. ఈ పండ్లలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు సైతం ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.
లసోడా పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్లు ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. ఈ పండ్లను తింటే క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం అధికంగా లభిస్తాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పడేలా చేస్తాయి. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉండేలా చూస్తాయి. డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ పండ్లలో ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. లసోడా వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను రోజూ తింటుంటే మేలు జరుగుతుంది. ఇక ఈ పండ్లు దోరగా గ్రీన్ కలర్లో, పండినవి పసుపు, గోధుమ రంగులోనూ దర్శనమిస్తాయి. ఈ పండ్లకు చెందిన తొక్క దళసరిగా ఉంటుంది. పండు రుచి కాస్త పులుపుగా ఉంటుంది. కనుక దీన్ని వంటల్లోనూ ఉపయోగిస్తారు. బాగా పండిన లసోడా పండ్లు తియ్యగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పచ్చి లసోడా కాయలను అయితే కూర చేసుకుని తినవచ్చు. పండ్లను నేరుగా తినవచ్చు. పచ్చి లసోడాలతో కొందరు ఊరగాయలను కూడా పెట్టుకుంటారు. ఈ పండ్లను కొందరు కూరగాయగా కూడా ఉపయోగిస్తారు. ఇలా లసోడా పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.