Meal Makers | మీల్ మేకర్ల గురించి అందరికీ తెలిసిందే. వీటినే సోయా చంక్స్ అని కూడా పిలుస్తారు. వీటితో అనేక రకాల కూరలను చేస్తుంటారు. పులావ్, రైస్, బిర్యానీ వంటి వంటకాల్లోనూ వీటిని వేస్తుంటారు. మీల్ మేకర్లు ఎంతో రుచిగా ఉంటాయి. కనుక వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినని వారికి వీటిని శాకాహార మాంసంగా చెబుతుంటారు. ఎందుకంటే మీల్ మేకర్లలో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. కనుక శాకాహారులకు కావల్సిన ప్రోటీన్లను ఇవి అందిస్తాయి. అందుకనే శాకాహారులు మీల్ మేకర్లను అధికంగా తింటుంటారు. అయితే మీల్ మేకర్లను తినకూడదని, వాటిని కృత్రిమంగా తయారు చేస్తారు కనుక మన ఆరోగ్యానికి హాని చేస్తాయని చాలా మంది విశ్వసిస్తారు. మరి ఇవి నిజంగానే మన ఆరోగ్యానికి హానికరమా..? వీటిని అసలు తినకూడదా..? వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారు..? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్లను సోయా బీన్ నూనె నుంచి తయారు చేస్తారు. సోయాబీన్ నూనెను తయారు చేయగా మిగిలిన పదార్థాన్ని సోయా పిండిగా మారుస్తారు. దీంతో మీల్ మేకర్లను తయారు చేస్తారు. ఈ పిండిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక మీల్ మేకర్లు స్పాంజిలా మెత్తగా ఉంటాయి. కాబట్టే వీటిని తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. కనుక వెజిటేరియన్లు మీల్ మేకర్లను నాన్ వెజ్ గా భావించి ఇష్టంగా తింటుంటారు.ఇక మీల్ మేకర్లలో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. నాన్ వెజ్ తినని వారికి ఈ ప్రోటీన్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్ల కోసం వారు మీల్ మేకర్లపై ఆధారపడవచ్చు. 100 గ్రాముల మీల్ మేకర్లను తింటే సుమారుగా 50 గ్రాముల మేర ప్రోటీన్ లభిస్తుంది. కనుక ప్రోటీన్లకు మీల్మేకర్లను ఉత్తమ వనరుగా చెప్పవచ్చు. ప్రోటీన్ల వల్ల కండరాల నిర్మాణం జరుగుతుంది. కండరాలకు శక్తి లభిస్తుంది. దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. చక్కని దేహాకృతి సొంతం అవుతుంది.
మీల్ మేకర్లను తింటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త నాళాలు ఆరోగ్యంగా మారుతాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. మీల్ మేకర్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మీల్మేకర్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు వీటిని తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. మీల్ మేకర్లను తినడం వల్ల క్యాల్షియం అధికంగా లభించి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. దీని వల్ల వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
మీల్ మేకర్లలో ఐరన్, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ఇంకా ఎన్నో రకాల విధులను నిర్వర్తిస్తాయి. ఇలా మీల్ మేకర్లను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక మీల్ మేకర్లను తినాలా.. వద్దా.. అని సందేహించాల్సిన పనిలేదు. వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు. ఎలాంటి దుష్పరిణామాలు కలగవు. అయితే మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ లభించే మీల్ మేకర్లను వాడకూడదు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాటిని వాడితేనే మేలు జరుగుతుంది. మీల్ మేకర్లలో ఐసోఫ్లేవోన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. కనుక థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు. లేదంటే శరీరంలో అయోడిన్ లోపం ఏర్పడి థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువవుతుంది. కొందరికి సోయా ఉత్పత్తులు పడవు. అలర్జీ ఉంటుంది. అలాంటి వారు కూడా మీల్ మేకర్లను తినకూడదు. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు, గౌట్ సమస్య ఉన్నవారు, హార్మోన్ సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ మీల్ మేకర్లను తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.