మారేడ్‌పల్లి, జనవరి 9: ఎదిగిన బిడ్డ చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని కష్టపడి చదించిన ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న ఆ విద్యార్థిని ఒక్కసారి ఇంట్లో కుప్పకూలి అపస్మారకస్థితిలోకి వెళ్లగా ..చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. కండ్ల ముందే తమ కుమార్తె ఆకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులకు గుండె కోత మిగిలింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… మల్కాజ్‌గిరిలోని మారుతీనగర్ ప్రాంతానికి చెందిన గుడేటి నర్సింగ్‌రావు, మాలతి దంపతులకు నలుగురు సంతానం. వీరిలో కుమార్తెలు వైష్టవి, వర్షిణి (16), కుమారులు హర్ష, హరుష్లు ఉన్నారు. మారేడ్‌పల్లిలోని డాక్టర్ మునగా రామ మోహన రావు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వర్షిణి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది.
కాగా కళాశాలలో యాజమాన్యం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. వైష్టవి కొంత ఆలస్యంగా చేరుకోవడంతో కళాశాలకు చెందిన ఇంగ్లీష్, ఫిజిక్స్ లెక్చరర్స్ అయిన మధుర, శ్రీలక్ష్మిలు ఆ అమ్మాయిని అందరి ముందు అసభ్యకర పదజాలంతో మందలించారు. పరీక్ష రాసిన వర్షిణి అనంతరం ఇంటికి వెళ్లింది. మానసింగా కుంగిపోయి కళాశాలలో జరిగిన విషయాన్ని తల్లి మాలతికి చెప్పింది. తర్వాత వెళ్లి మాట్లాడదామని కుమార్తెను తల్లి సముదాచించింది. ఇంతలోనే వర్షిణి తలనొప్పిగా ఉందని సృహ తప్పి పడిపోయింది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా వైద్యులు స్కానింగ్ చేసి అమ్మాయికి తీవ్ర మనస్థాపంలో బ్రెయిన్లో బ్లడ్ స్కాట్ అయిందని చెప్పారు. కాగా చికిత్స పోందుతూ.. గురువారం రాత్రి మృతి చెందింది.
విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్, మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి మారేడ్‌పల్లిలోని కళాశాలకు వైష్టవి మృతదేహాన్ని తీసుకొచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్ వెంకటేష్ తన సిబ్బందితో కళాశాలకు చేరుకొని వారికి నచ్చజెప్పి వైష్టవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నాగరాణి వెల్లడించారు.
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న వర్షిణి అధ్యాపకుల వేధింపుల వల్ల మృతి చెందిన విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్. శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కళాశాలకు చేరుకొని మృతురాలి తల్లి మాలతి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ విద్యార్థిని కుటుంబానికి గజ్జెల నాగేష్ ఆర్థిక సహాయం అందించారు.
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా నేటీకి విద్యా శాఖకు మంత్రిని నియమించకపోవడం సిగ్గు చేటన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి వర్షిణి కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పనస సంతోష్, గంగరాం, రాహుల్ పాల్గొన్నారు.