వందల ఏండ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్థిత్వాన్ని కాలరాసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, పలువురు కార్పొరేటర్లు, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ సభ్యులు, పలు వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి తలసాని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు.
సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ) బేగంపేట: సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. డివిజన్ల విభజన కూడా క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆఫీసుల్లో కూర్చొని గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ఏర్పాటు చేశారన్నారు. 150 డివిజన్లు ఉంటే 300కు పెంచి హైదరాబాద్, మలాజిగిరి, సైబరాబాద్ పేరుతో మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తలసాని మండిపడ్డారు.
సికింద్రాబాద్ పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు దశల వారీగా అనేక ఆందోళన కార్యక్రమాలు అహింసా మార్గంలో నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా ఈ నెల 11న ఉదయం 11 గంటలకు బాలంరాయ్‌లోని లీ ప్యాలెస్‌లో సమావేశం నిర్వహిస్తామన్నారు. సికింద్రాబాద్ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం, చరిత్ర, సంసృతిని కాపాడుకునేందుకు జరిపే పోరాటానికి కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యాపార, వాణిజ్య, కార్మిక, కుల సంఘాలు, ఉద్యమ సంఘాల ప్రతినిధులు, సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ప్రతి ఒకరూ ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. 11న నిర్వహించే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.
17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సరిళ్ల మీదుగా ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తలసాని తెలిపారు. ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్‌ను ముట్టడిస్తామని చెప్పారు. అవసరమైతే బంద్‌లు, ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కోలన్ లక్ష్మి, టి. మహేశ్వరి, కూర్మ హేమలత, సామాల హేమ, ప్రసన్న లక్ష్మి, కంది శైలజ, రాసూరి సునీత, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, లషర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శాదం బాలరాజ్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కోలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం నిర్వహించే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతును తెలుపుతూ పలు సంఘాల ప్రతినిధులు తమ తీర్మానాలను ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్‌కు అందజేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 35కు పైగా వ్యాపార, వాణిజ్య, కార్మిక, కుల సంఘాల ప్రతినిధులు హాజరై తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.
పాట్ మారెట్ మార్వాడీ అసోసియేషన్, మోండా మారెట్ రిటైల్ వెజిటబుల్ అసోసియేషన్, సికింద్రాబాద్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్, ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ అసోసియేషన్, బెంగాలీ సమాజ్, పేపర్ మర్చంట్స్ అసోసియేషన్, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, ప్రభుత్వ గుర్తింపు పొందిన సూల్స్ అసోసియేషన్, స్వప్నలోక్ అసోసియేషన్, విశ్వకర్మ సంఘం, మేరు సంఘం, బోయిన్పల్లి కూరగాయల మారెట్ హమాలీ సంఘం, తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం.. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి.