సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో 27 పురపాలికలు విలీనమవుతున్న తరుణాన్ని కొన్ని మున్సిపాలిటీల అధికారులు తమకు ‘కాసుల పంటగా’ మార్చుకున్నారు. విలీన ప్రక్రియ పూర్తయితే లెక్కలు తేలవన్న ధీమాతో బిల్లుల్లో అడ్డదారులు తొక్కి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. విలీనం తర్వాత నిబంధనలు కఠినతరం అవుతాయని, ఆర్థిక వ్యవహారాలన్నీ జీహెచ్ఎంసీ గుప్పిట్లోకి వెళ్తాయన్న అధికారులే స్వయంగా సంబంధిత కాంట్రాక్టర్లకు మార్గనిర్దేశం చేసి ‘బిల్లుల జాతర’ సృష్టించారు. తుక్కుగూడ పురపాలిక వేదికగా అడ్డగోలుగా బిల్లులు మంజూరు చేశారు.
పురోగతిలో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం 50 శాతం దాటక ముందే 80 శాతం పనులు పూర్తయినట్లు రికార్డులు సృష్టించి ముందే 90 శాతం పేమెంట్లను పూర్తి చేశారు. వాస్తవంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన (ఎస్టీఓ/ట్రెజరీ) అకౌంట్ నుంచి బిల్లులు పొందాల్సిన కాంట్రాక్టర్లకు ఏకంగా మున్సిపాలిటీకి సంబంధించి ఖాతాల్లోకి బిల్లులు ఇవ్వడం అధికారులకే చెల్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఇలా దాదాపు రూ. 16 కోట్ల మేర ఖజానా నుంచి ఖాళీ చేయించి భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు. ఒక్కో బిల్లు పాస్ కావడానికి సదరు కాంట్రాక్టర్ల నుంచి 6 నుంచి 10 శాతం పర్సంటేజీతో అందినకాడికి వెనకేసుకున్నట్లు ఆ నోట ఈ నోట బయటకు వచ్చి ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో ఈ అక్రమ తంతు వ్యవహారంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
సంబంధిత ఇంజినీర్లతో పాటు డిప్యూటేషన్‌పై వచ్చి రెండు మున్సిపాలిటీల్లో కీలకంగా వ్యవహరిస్తున్న అకౌంటెంట్లు కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఇప్పటికే మణికొండ, నిజాంపేట పురపాలికల్లో అక్రమాల తంతును విజిలెన్స్ విభాగం నిగ్గుతేల్చే పనిలో ఉండగా, తాజాగా తుక్కుగూడ, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ పురపాలికల్లో విలీన చివరి క్షణాల్లో జరిగిన ఆవినీతి, అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మేధావులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తుక్కుగూడ మున్సిపాలిటీల పరిధిలోని చల్లా గార్డెన్ హౌస్ నుంచి రాకేశ్ గౌడ్ హౌస్ వరకు సీసీ రోడ్ల నిర్మాణం, రూ.3.86 కోట్లతో , -శ్రీనివాస్ చారి హౌస్ నుంచి మల్లారెడ్డి హౌస్ , నర్సింహ హౌస్ నుంచి కృష్ణారెడ్డి హౌస్ వరకు (వార్డు నం 10) సీసీ రోడ్డు , వార్డు నంబరు 14లోని రాజమోనీ రాజ్ హౌస్ నుంచి ఏసీపీ కార్యాలయం ఎదురుగా సీసీ రోడ్డు , మహేశ్వరం రోడ్ నుంచి ఓహెచ్ఎస్ఆర్ రోడ్ వరకు సీసీ రోడ్డు , వార్డు నంబరు 14లోని శ్రీశైలం హైవే నుంచి రజక సంఘం వరకు సీసీ రోడ్డు నిర్మాణం పనులపై, వీటి బిల్లుల మంజూరుపై ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నంబర్లు, భవన నిర్మాణ అనుమతుల కోసం రూ. లక్షల్లో వసూలు చేసినట్లు ప్రచారం ఉంది. మున్సిపాలిటీ చట్ట ప్రకారం-2020 వరకు ఉన్న డాక్యుమెంట్లకే మున్సిపాలిటీ అనుమతులు ఇచ్చే అధికారం ఉంది. కానీ కొందరు అధికారులు పాత తేదీల్లో వాల్యూడేషన్ డాక్యుమెంట్లు సృష్టించి, అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇలా పది వరకు ఇచ్చినట్లు ఉద్యోగుల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. కొత్తగా ఇచ్చిన ఇంటి నంబర్లు, అనుమతులను పరిశీలిస్తే అధికారుల అవినీతి బట్టబయలవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.