‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్లో వర్షాభావ, కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా...
– ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు
– సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి వనరుల బలోపేతం
– వైరా జలాశయం ద్వారా 8 మండలాలకు తాగునీటి భరోసా
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 09 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్లో వర్షాభావ, కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను జిల్లాలోని జలాశయాలు, చెరువులకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ నీటి నిల్వలను పెంచడం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం, సాగునీటి వనరులను పరిరక్షించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సుమారు 17,150 ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం కలిగిన వైరా జలాశయం నీటిమట్టం డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో సీతారామ ఎత్తిపోతల పథకంలోని రాజీవ్ కాలువ ద్వారా గోదావరి జలాలను మళ్లించి జలాశయాన్ని నింపేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా వైరా పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎనిమిది మండలాల ప్రజలకు తాగునీటి సరఫరాకు భరోసా కల్పించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవని పరిస్థితుల్లో కూడా గోదావరి జలాలను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు వీలవుతోందన్నారు .
ప్రజలకు తాగునీరు అందించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, అందుకు అనుగుణంగా జలాశయాల్లో నీటి నిల్వలను కాపాడుకోవాలని, తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి, ఎక్కడా సరఫరాలో అంతరాయం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా అశ్వాపురం మండలంలోని బి.జి. కొత్తూరు పంప్ హౌస్-1 వద్ద ఖరీఫ్ 2026 సీజన్లో మొత్తం 1,604 గంటల పాటు భారీ మోటార్లను నిర్వహించి గోదావరి నది నుంచి 9.088 టీఎంసీల నీటిని ప్రధాన కాలువలోకి ఎత్తిపోసినట్లు కలెక్టర్ వివరించారు. అదేవిధంగా వి.కె. రామవరం వద్ద పంప్ హౌస్-2, కమలాపురం వద్ద పంప్ హౌస్-3 ద్వారా కూడా నీటిని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు సైతం గోదావరి జలాలను మళ్లించడం ద్వారా నీటి కొరతను అధిగమించేందుకు ఈ పంపింగ్ కార్యకలాపాలు దోహదపడుతున్నాయని అన్నారు. ఈ నీటి మళ్లింపు ద్వారా ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, జూలూరుపాడు, సుజాతనగర్, తల్లాడ తదితర మండలాల్లోని నీటి వనరులకు ప్రయోజనం చేకూరిందని తెలిపారు. నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లోని చెరువులు, జలాశయాలను నింపడం ద్వారా తాగునీటి అవసరాలకు అదనపు భరోసా కల్పించడంతో పాటు వ్యవసాయ అవసరాలకు కూడా నీరు అందుబాటులోకి వచ్చిందన్నారు.
జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం ప్యాకేజీలు 4, 7, 8, 9 అలాగే 18ఎల్ రాజీవ్ కాలువ పరిధిలోని 20 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో గోదావరి జలాలను నిల్వ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ చెరువుల్లో మొత్తం 1,058.65 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటిని నింపడం ద్వారా ప్రత్యక్షంగా 9,436 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భద్రత కల్పించినట్లు వివరించారు. ములకలపల్లి మండలంలోని ఏడుళ్లవాగు చెరువు, పెద్దయ్య చెరువు, శ్రీరాములు చెరువు, తుమ్మకుంట, ఊరచెరువు, ఏడుళ్ల చెరువుల్లో నీటిని నిల్వ చేసినట్లు తెలిపారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని వెంగళరావు సాగర్, పెద్దచెరువు, అన్నదైవం ప్రాజెక్టు, చంద్రుగొండ మండలంలోని మద్దుకూరు ప్రాజెక్టు, జంట్లకుంట, గండ్ర వీరయ్య కుంట, శనగకుంట, జూలూరుపాడు మండలంలోని మేడికుంట, ఎర్రవాగు ప్రాజెక్టు, శనగచెరువు, సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం ప్రాజెక్టు, తల్లాడ మండలంలోని సుబ్బమ్మ చెరువు, బ్రాహ్మణపల్లి చెరువు, ఓర చెరువుల్లో నీటి నిల్వలను పెంచినట్లు తెలిపారు. చెరువుల్లో నీటిని నిల్వ చేయడం వల్ల ఆయా గ్రామాల్లోని రైతులకు సాగునీటి భరోసా లభించడంతో పాటు పశువుల అవసరాలకు, స్థానిక నీటి వనరుల వినియోగానికి కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకంలోని రాజీవ్ కాలువ ద్వారా మళ్లించిన గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టు ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూర్చాయని కలెక్టర్ తెలిపారు. చివరి ఆయకట్టులో నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితులను నివారించేందుకు గోదావరి జలాలను వినియోగించినట్లు వివరించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని 123 చిన్న నీటిపారుదల చెరువుల్లో 3,967 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటిని నిల్వ చేయడం ద్వారా 11,965 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు వైరా ప్రాజెక్టు పరిధిలో సుమారు 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భద్రత కల్పించినట్లు తెలిపారు. నీటి వృథాను నివారించడంతో పాటు ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాగునీటి భద్రతకు భరోసా కల్పించడంతో పాటు 20 చెరువుల్లో నీటి నిల్వలను పెంచడం, 9,436 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భద్రత కల్పించడం, భూగర్భ జలాల పెంపునకు దోహదపడటం సాధ్యమైందని కలెక్టర్ అంకిత్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

