భూతాపం.. ప్రాణాంతక క్యాన్సర్లకూ దారితీస్తున్నది. అధిక ఉష్ణోగ్రతలతో మహిళల్లో రొమ్ము, అండాశయం, గర్భాశయ క్యాన్సర్ల ముప్పు పెరుగుతున్నది. మధ్యప్రాచ్యంతోపాటు తూర్పు ఆఫ్రికాకు చెందిన 17 దేశాల్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. గడిచిన 30 ఏళ్లలో.. ఈ 17 దేశాల్లో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే దాదాపు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయట. అందుకే, మిగతా దేశాలతో పోలిస్తే.. ఇక్కడి మహిళలపై అధిక ప్రభావం కనిపిస్తున్నదట. మధ్యప్రాచ్యంతోపాటు తూర్పు ఆఫ్రికా దేశాల్లో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలను చూపుతున్నాయో వెల్లడించింది.
వాతావరణంలో పెరిగే ప్రతి ఒక్క డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత.. మహిళల్లో క్యాన్సర్ ప్రాబల్యం పెంచుతున్నదని ఈ అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా అండాశయ క్యాన్సర్, గర్భాశయం, రొమ్ము క్యాన్సర్లు వస్తున్నట్లు కనుగొంది. ‘అధిక ఉష్ణోగ్రతలు వాయు కాలుష్యాన్ని మరింత పెంచుతాయి. ఎండోక్రైన్ వ్యవస్థను ప్రభావితం చేయడంతోపాటు మహిళల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో మహిళల్లో క్యాన్సర్కు దారితీస్తాయ’ని అంటున్నారు అధ్యయనకారులు. ఈ అధ్యయనం మధ్యప్రాచ్యం, తూర్పు ఆఫ్రికా దేశాలపైనే దృష్టిపెట్టినప్పటికీ.. ఇతర వేడి ప్రాంతాలకూ ఒక గట్టి హెచ్చరిక చేస్తున్నది. ఎందుకంటే.. భూగోళంపై ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ.. ప్రపంచంలోని మరిన్ని ప్రాంతాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నది.