Summer | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం నిర్మల్ జిల్లా లింగాపూర్‌లో అత్యధికంగా 40.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 40.6, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, నిజామాబాద్ జిల్లాల్లో 40.4, జగిత్యాల, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో 40.3, జయశంకర్ భూపాలపల్లిలో 40.2, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 40.1 డిగ్రీలు, మంచిర్యాలలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న నేపథ్యంలో ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నది.