కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఆదాని కంపెనీ ( Orient Cement Company – Adani ) గుర్తింపు సంఘం ఎన్నికలకు (Elections ) హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కార్మిక శాఖ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈనెల 19న ఎన్నికలు నిర్వహించనున్నారు. కంపెనీ ఆవరణలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
మొత్తం 257 మంది కార్మికులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఐదు యూనియన్లకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండగా యూనియన్లకు గుర్తులను కేటాయించారు. ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం విత్డ్రా, 18న ప్రచారం ముగించాలని కార్మికశాఖ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికలు జరగుతాయా లేదా అనే సందిగ్ధంలో ఉన్న ఓరియంట్(ఆదానీ) గుర్తింపు సంఘం ఎన్నికలు చివరకు పలు యూనియన్లు హైకోర్టును ఆశ్రయించడం అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.