హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : గత ప్రభుత్వ హయాంలో వివిధ కోర్టుల్లో నియమితులైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను (ఏపీపీ) కాంగ్రెస్ సరారు ఎందుకు తొలగించిందో కారణాలు చెప్పాలని, ఇందుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఎంతమందిని నియమించారో, ఎంతమందిని తొలగించారో, ఎంతమంది పనిచేస్తున్నారో తెలపాలని చెప్పింది. పనిచేస్తున్న వారి పదవీకాలం ఎంత ఉన్నదో వివరాలు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల నుంచి పలువురు ఏపీపీలను తొలగిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ 13 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టులో పనిచేస్తున్న తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం తొలగించిందని తెలుపుతూ న్యాయవాది టీ వెంటేశ్వరప్రసాద్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే తీరుగా మరో 12 మంది వేర్వేరు పిటిషన్లు దాఖ లు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను తొలగిస్తూ ఈ నెల 10న జీవో జారీ అయ్యిందని, ఎందుకు తొలగిస్తున్నారో చెప్పలేదని, తమకు వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వకుండా హోంశాఖ జారీచేసిన జీవో చట్టవిరుద్ధమని ప్రకటించాలని పిటిషన్లల్లో పేరొన్నారు. తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఏపీపీలకు పదవీకాలం పూర్తికాకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందని చెప్పారు. చట్టవ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు వివరాలు సమర్పించాలని సర్కారును ఆదేశించింది.