గద్వాల, సెప్టెంబర్ 22 : చేసేది దైవవృత్తి, ప్రవృత్తి మాత్రం అమాయకులను మోసం చేయడం ఆయన లక్ష్యం. తన తియ్యటి మాటలతో బాధితులను నమ్మిస్తాడు. అదే నమ్మకంతో వారిని మోసం చేస్తాడు. ఇదేమని ప్రశ్నిస్తే ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడడం ఆయన నైజం. దైవ వృత్తి లో ప్రజలకు నీతి బోధలు చేస్తాడు.. కానీ తాను చేసే ది అంతా అవినీతి. ఇలా తన మాయమాటలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజిట్ వీసాల పేరుతో భారీ దందా నడుపుతూ అమాయక బాధితుల నుంచి లక్షలు దండుకుకోవడంతో సోమవారం బాధితులంతా గద్వాల కలెక్టరేట్‌కు చేరుకొని తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. ఒక వైపు గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ఓ చర్చిలో పాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ అలియాస్ అబ్రహం మరో వైపు అమాయకులను మోసం చేసి డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా విదేశీ ఏజెంట్ అవతారం ఎత్తాడు.
దీంతో సొంతూరులో ఉపాధి కరువై ఇతర దేశాలకు వలస వెళ్తున్నవారే ఆయన టార్గెట్. ఉపాధి కరువై ఇజ్రాయిల్ లాంటి దేశాలకు వలస వెళ్తున్న పలువురు బాధితులు నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. మోసపోయిన బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన గొల్లమేరీ, బేబి కిశోరి, భారతి, బాలకృష్ణ, ప్రసాద్, చిట్టిబాబు, ప్రభుదాస్, సునీల్, రత్నకుమారి, విజయమోహన్, పద్మతోపాటు మరి కొందరు ఇజ్రాయిల్‌లో ఉద్యోగాల కోసం ధరూర్ మండలంలో చర్చి పాస్టర్ సుదర్శన్ అలియాస్ అబ్రహంను సంప్రదించారు. విజిట్ వీసా పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి పాస్టర్ రూ.8 నుంచి రూ.9లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.
9 జూన్ 2024లో కోనసీమ జిల్లాకు చెందిన మొత్తం 43 మందిని టూరిస్టు వీసా పేరు మీ ద ఇజ్రాయిల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కొన్ని ప్రదేశాలు చూయించిన తర్వాత అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. కొంత కాలం తర్వాత ఆ దేశ అధికారులు టూరిస్ట్ వీసా మీద వెళ్లిన వారిని తిరిగి భారత్‌కు పంపడంతో వీసా ఖర్చులు పోను మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఏజెంట్(పాస్టర్)పై బాధితులు ఒత్తిడి తేగా ఆయన బాధితులకు చెక్కులు రాసిచ్చాడు. తీరా బ్యాంకులో నగదు లేకపోవడంతో చెక్కులు విత్‌డ్రా చేసుకోలేకపోయారు. దీంతో బాధితులు పాస్టర్‌ను నిలదీయగా ఈ రోజు రేపు వారం అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు.
బాధితులు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తేగా ఎవరికైనా చెప్పుకోండి నేను డబ్బులు ఇచ్చేది లేదు అంటూ బాధితులపైనే బెదిరింపులకు పాల్పడడంతో వారు విధి లేని పరిస్థితిలో ధరూర్‌కు చేరుకున్నారు. ధరూర్ మండల కేంద్రంలోనే చర్చిలో బాధితులు ఉంటూ తమకు డబ్బులు ఇవ్వాలని పాస్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో తమకు న్యాయం చేయాలని ధరూర్ పోలీస్ట్‌షన్‌కు బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా, ధరూర్ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించినట్లు బాధితులు వాపోయారు.
తాము అప్పు చేసి డబ్బు లు ఇచ్చామని ప్రస్తుతం వాటికి వడ్డీలు కట్టలేక రోడ్లపై న్యాయం కోసం తీరుగుతున్నామని తమకు న్యాయం చేసి బాధితుడి నుంచి డబ్బులు ఇప్పించాలని వారు ధరూర్ పోలీసులను కోరగా, మీ కోనసీమ జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలని ధరూర్ పోలీసులు సూచించచడంతో వారు విధి లేని పరిస్థితిలో సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
పాస్టర్‌పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కోరారు. ఈ పాస్టర్ గతంలో నిజామాబాద్, కరీంనగర్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇలాగే బాధితులను మోసం చేసినట్లు తెలిసింది. ఇతనిపై కోనసీమ జిల్లా సక్కినేటిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.