హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ‘కాయకష్టం చేసి ఆర్జించిన కూలి డబ్బుల్లో పైసాపైసా కూడబెట్టి కొన్న జాగలో చిన్న ఇల్లు కట్టుకుంటే హైడ్రా రాత్రికిరాత్రి వచ్చి నిర్దాక్ష్యిణంగా నేలమట్టం చేసింది. ఇండ్ల స్థలాలు కొన్నట్టు రిజిస్ట్రేషన్ పత్రాలున్నాయి. ఇల్లు కట్టుకునేందుకు గ్రామపంచాయతీ ఇచ్చిన పర్మిషన్లు ఉన్నాయి. చట్ట ప్రకారం తీసుకున్న విద్యుత్తు సర్వీస్‌లైన్, నల్లా కనెక్షన్, ఏటా కట్టే ఇంటి పన్ను రసీదులు.. ఇలా అన్నీ ఉన్నాయి. హైడ్రా ఇవేవీ చూడలేదు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. తెల్లవారుజామున మందీమార్బలం, క్రేన్లు, బుల్డోజర్లతో వచ్చి పడిన హైడ్రా ఇండ్లను కూల్చేసింది. కొద్ది క్షణాల్లోనే 28 ఇండ్లను నేలమట్టం చేసింది. ఇంట్లో సామాన్లు తీసుకొనేందుకు కూడా అవకాశమివ్వలేదు. పేదవాళ్ల ఇండ్లపై గునపం పోట్లు పొడించింది. రాష్ట్ర సరార్ ఆదేశాలతో హైడ్రా కనికరం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని అందజేస్తే.. మేము పట్టించుకోం. కోర్టు ఆదేశాలను అమలు చేయం.
ఏం చేసుకుంటారో చేసుకోండి.. అని అధికారులు బాధితుల ముఖంమీదనే కోర్టు ఆర్డర్ కాపీని చించేస్తే అడిగే దికులేదు. కోర్టుధికరణ కేసు వేసినా పరిస్థితిలో మార్పు లేదు. ఏం చేయాలి? బాధితులు కోర్టు మెట్లు ఎకినా ప్రయోజనం లేకపోతే ఎకడికి వెళ్లాలి. కోర్టు ధికరణ కేసులన్నా అధికారులకు భయం లేకుండాపోయింది. ఒకటంటే ఒక కోర్టు ధికరణ కేసులోనైనా ఏ ఒక అధికారినీ జైలుకు పంపిన దాఖలాలు గత 20 ఏండ్ల అనుభవంలో చూడలేదు. కావాలంటే కోర్టులో చెప్తున్న ఈ విషయాలను రికార్డు చేసుకోండి. పేదవాడికి గూడు లేకుండా చేసిన అధికారులపై చర్యలు లేవు. కూల్చిన ఇండ్ల స్థానంలో తాతాలిక నివాస ఏర్పాట్లు చేసుకొనే అవకాశం ఇవ్వాలంటూ బాధితులు చేసుకున్న దరఖాస్తులను అధికారులు పట్టించుకోవడం లేదు. ఏం చేయాలి? కనీసం కూల్చివేసిన ఇండ్ల స్థలాల వద్ద హైడ్రా దౌర్జన్యంగా ఏర్పాటుచేసిన కంచె తొలగింపునకు అయినా ఉత్తర్వులు ఇవ్వండి. వీధి వ్యాపారాలు, చిరువ్యాపారాలు చేసుకునే బాధిత పేదవాళ్లను చూడండి’ అంటూ న్యాయవాది రామవరం చంద్రశేఖర్‌రెడ్డి గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్‌గూడ గ్రామంలోని సర్వే నం.6లో ఉన్న 28 ఇండ్లను కూల్చివేసిన హైడ్రా అక్కడ ఏర్పాటుచేసిన కంచె తొలగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని, బాధితుల నివాస ఏర్పాట్లకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ తమ్మిశెట్టి శ్రీకాంత్ సహా 22 మంది పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం విచారణ చేపట్టారు. ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.

అంతకుముందు న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘బాధిత పిటిషనర్ల ప్లాట్ నంబర్లు 136, 153, 152, 151, 178, 179, 135, 177, 168, 173, 175, 177, 170, 174, 169, 132, 172, 157, 171, 180, 180/ఎ, 181/ఎ, 137, 150, 155, 181/బీ చుట్టూ హైడ్రా కమిషనర్ ఏకపక్షంగా కంచె వేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రతులను అందజేసినప్పటికీ, నేటికీ అమల్లో ఉన్న హైకోర్టు ఆదేశాల ప్రతులను ఇచ్చినప్పటికీ, తాతాలిక నివాసాల నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ నిరాకరించారు. ఇది ఏకపక్షం, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. మున్సిపల్ అధికారులు ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాక వాటిని హైడ్రా కూల్చివేయడం చట్ట విరుద్ధం. ఒకరు జాగాలు అమ్ముతారు. రిజిస్ట్రేషన్ అధికారులు ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తారు. మున్సిపల్ అధికారులు ఇండ్ల నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తారు. ఇంటి పన్ను వసూలు చేస్తారు. నల్లా కనెక్షన్ ఇచ్చి చార్జీలు కూడా వసూలు చేస్తారు. నిజంగానే ఆ ఇండ్లన్నీ ప్రభుత్వ జాగలో కట్టుకొని ఉంటే ఈ అధికారుల్లో ఒకరంటే ఒకరు కూడా ఎందుకు సస్పెన్షన్ కాలేదు? కోర్టు ఉత్తర్వులను అమలు చేయని ఒక అధికారీ సస్పెండ్ కాలేదు, జైలుకూ వెళ్లలేదు. జాగ అమ్మి సొమ్ము చేసుకున్నోళ్ల నుంచి ప్రజాధనంతో జీతాలు తీసుకునే రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులు అంతా గట్టుమీద హాయిగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
పటేల్‌గూడ గ్రామంలోని పేదలకు చెందిన 28 ఇండ్లను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలను న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కథనాల క్లిప్పింగ్స్తోపాటు హైడ్రా కూల్చివేతలకు ముందు ఆనందంగా గృహప్రవేశం చేస్తున్న జంట తీసుకున్న ఫొటో, ఆ తర్వాత కూల్చివేసిన ఇల్లు.. వంటివి కూడా ఒక బుక్‌లెట్‌లా చేసి న్యాయమూర్తికి అందజేశారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వంతోపాటు హైడ్రాను ఆదేశించారు.
‘రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకుని నయాపైసలను కూడబెట్టి గూడు ఏర్పర్చుకున్న పేద బాధిత పిటిషనర్లు నిండా మోసపోయారు. నడిరోడ్డు మీదికి నెట్టేసినోళ్లు బేషుగ్గా ఉన్నారు. ఇదేమి న్యాయం? హైకోర్టు ఆదేశించినా అధికారుల్లో చలనం లేకపోతే ఎలా? రాజ్యాంగ ధర్మాసనం వద్ద చెప్పుకొన్న గోడుకే దికు లేకపోతే బాధితులు ఎకడికి వెళ్లాలి?’ అని చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసి వారం రోజులు కూడా కాలేదని, ఇంటికి కట్టిన గుమ్మిడి కాయ అలాగే పచ్చగా ఉన్నదని, గుమ్మాలకు కట్టిన పూలు కూడా వేలాడుతూనే ఉన్నాయని, ఈలోగానే హైడ్రా ఆ ఇంట్లో వాళ్లను కట్టుబట్టలతో వీధిలో పడేసిందని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఈ దశలో హైడ్రా తరఫు న్యాయవాది కల్పించుకుంటూ అది ప్రభుత్వ భూమి అని చెప్పగానే.. నిజంగానే అది ప్రభుత్వ భూమి అయితే, రిజిస్ట్రేషన్ల దశ నుంచి ఇంటి నిర్మాణాల అనుమతులు, పన్ను విధింపు, నల్లా, విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చిన వాళ్లపై ఏం చర్యలు తీసుకున్నారని చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. పేద వాడి ముఖం చూసైనా అదే స్థలాల్లో బాధితులు నివాసం ఏర్పర్చుకునేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు. పిటిషనర్ల అభ్యర్థనలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని చెప్పారు.