– చట్ట ప్రకారం తప్ప భూముల నుండి తొలగించవద్దని ఆదేశాలు
కారేపల్లి, మే 19 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి రెవెన్యూ గ్రామ రైతులకు తెలంగాణ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. తమ వ్యవసాయ భూములపై హక్కులు కలిగిన రైతులను చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా బలవంతంగా భూముల నుండి వెళ్లగొట్టవద్దని కోర్టు స్పష్టం చేసింది. రైతుల వాదన ప్రకారం.. తమ పేర్లతో పట్టాదార్ పాస్ బుక్స్, రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ ఓఆర్ ) పత్రాలు కలిగి ఉన్న భూములను సరైన భూసేకరణ ప్రక్రియ లేకుండానే స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ చొరవతో రైతులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా “భూమి స్వాధీనం, పునరావాసం, పునరుద్ధరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం- 2013” ప్రకారం భూసేకరణ చేయకుండా రైతుల భూముల్లో జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధమని కోర్టులో వాదనలు వినిపించబడ్డాయి. మరోవైపు సింగరేణి సంస్థ తమ భూములను రక్షించుకునేందుకు మాత్రమే ఫెన్సింగ్ పనులు చేపడుతున్నామని కోర్టుకు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొంటూ ప్రతివాదులు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 22 జూన్ 2026కు వాయిదా వేసింది. అంతవరకు చట్ట ప్రకారం తప్ప రైతులను వారి భూముల నుండి బలవంతంగా వెళ్లగొట్టవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను స్థానిక రైతులు, ప్రజా సంఘాలు భూముల హక్కుల పరిరక్షణలో కీలక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి.