Inder Kaur : పంజాబ్‌లో యువ గాయని ఇందర్ కౌర్ (29) అలియాస్ యాషిందర్ కౌర్ అనుమానాస్పదంగా మరణించారు. ఆమె మృతదేహాన్ని లూధియానాలోని ఒక కాలువలో గుర్తించారు. కొద్ది రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ మృతదేహాన్ని లూధియానా పరిధిలోని నీలోన్ కాలువలో సోమవారం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్, లూధియానాలోని జమాల్‌పూర్‌కు చెందిన ఇందర్ కౌర్ పంజాబీ సాంగ్స్‌తో సింగర్‌గా పేరు తెచ్చుకుంది.
ఆమె ఈ నెల 13 నుంచి కనిపించకుండా పోయింది. ఇంటికి అవసరమైన సరుకులు కొనడానికి వెళ్తున్నానని చెప్పి, తన ఫిగో ఫోర్డ్ కారులో వెళ్లింది. అయితే, ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబం సుఖ్వీందర్ సింగ్ అలియాస్ సుక్కా మీద అనుమానం వ్యక్తం చేసింది. ఇందర్ కౌర్‌ను సుఖ్వీందర్ సింగ్ కిడ్నాప్ చేసి, హత్య చేసి ఉంటాడని ఆమె సోదరుడు ఆరోపించాడు. కొంతకాలంగా అతడు తనను పెళ్లి చేసుకోవాలని ఇందర్ కౌర్‌ను వేధిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అతడికి ఇప్పటికే పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. సుఖ్వీందర్ సింగ్ భార్య, పిల్లల గురించి తెలిసిన ఇందర్ కౌర్ అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది.
ఈ ఇద్దరికీ ఐదేళ్లక్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇక, ఇందర్ కౌర్ హత్యకు సంబంధించి పోలీసులు.. సుఖ్వీందర్ సింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పంజాబ్‌లోని మోగాకు చెందిన సుఖ్వీందర్ సింగ్ కెనడాలో ఉంటున్నాడు. అతడు నేపాల్ ద్వారా ఇండియాకు వచ్చాడు. ఈ ఘటన అనంతరం ఇదే మార్గంలో కెనడా వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. అయితే, సుఖ్వీందర్ తండ్రి ప్రీతమ్ సింగ్‌ను, అతడి స్నేహితుడు కరంజిత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొదట ఇందర్ కౌర్ కారు నీలోన్ కాలువ సమీపంలో ఆదివారం దొరికింది. అనంతరం సోమవారం అదే కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది.
ఇందర్ మృతదేహాన్ని పోలీసులు సంరాలా సివిల్ హాస్పిటల్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు. ఇందర్ కౌర్ గతంలో పంజాబ్‌లో పాలు పాటలు పాడింది. కొంతకాలంగా సొంత బొటిక్ ప్రారంభించి వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమె మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.