హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రైల్వే ప్రమాద పరిహారంగా మంజూరైన రూ.8 లక్షల్లో రూ.7.20 లక్షలను రూ.10 వేల చొప్పున 72 ఫిక్స్డ్ డిపాజిట్లుగా చేయాలన్న రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలను హైకోర్టు ఇటీవల సవరించింది. అలా నెలకు రూ.10 వేల చొప్పున 72 నెలలపాటు డిపాజిట్లు చేయడం వల్ల పిటిషనర్‌కు కలిగే ప్రయోజనం ఏమిటో రైల్వే శాఖ తరఫు న్యాయవాది వివరించలేకపోయారని, పరిహార మొత్తాన్ని ఇన్ని డిపాజిట్లుగా విభజించడం సహేతుకం కాదని పేరొన్నది.
ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం పిటిషనర్‌కు చెల్లించిన రూ.80 వేలతోపాటు అప్పటివరకు వచ్చిన వడ్డీని కూడా చెల్లించాలని, మిగిలిన రూ.7.20 లక్షలను రూ.1.80 లక్షల చొప్పున నాలుగు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. వాటిపై సమ్మిళిత వడ్డీ కొనసాగించాలని స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన తేదీ నుంచి పరిహారం మొత్తం జమయ్యే వరకు ఏడాదికి 9% వడ్డీ చెల్లించాలని ట్రిబ్యునల్ గతంలో నిర్ణయించింది.
పిటిషనర్ తన కుమార్తె విద్య, వివాహం లేదా ఇతర అవసరాల కోసం పరిహారంలో కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకోవాల్సిన అవసరం ఉంటే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని తెలిపింది. అటువంటి దరఖాస్తును చట్టప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ట్రిబ్యునల్‌ను హైకోర్టు ఆదేశించింది.