Pager Bombs | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: లెబనాన్‌లో ఏకకాలంలో వందల సంఖ్యలో పేజర్లు పేలిపోవడం సంచలనంగా మారింది. మంగళవారం జరిగిన ఘటనల్లో 12 మంది మరణించడంతో పాటు దాదాపు 2,800 మంది గాయపడ్డారు. సెల్ఫోన్ల యుగం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కనుమరుగైన పేజర్లను హెజ్బొల్లా ఇంకా ఎందుకు వినియోగిస్తున్నది? ఒకేసారి వేల సంఖ్యలో పేజర్లు ఎలా పేలిపోయాయి? ఈ తరానికి పెద్దగా తెలియని పేజర్ల కథ ఏంటి? వంటివి ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న పరికరమైన పేజర్‌ను 1949లో ఆల్ఫ్రెడ్ గ్రాస్ కనుగొన్నారు. 1964లో మోటోరోలా కంపెనీ ‘పేజ్బాయ్ 1’ పేరుతో మొదటి పేజర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పేజర్లకు ఉండే కాలిక్యులేటర్ లాంటి స్క్రీన్‌పై చిన్న మెసేజ్‌లు పంపించే వీలు ఉండేది. కేవలం మెసేజ్ చేసుకోవడానికి పేజర్లు పని చేసేవి. 1990ల చివరి వరకు అత్యవసర సందేశాలను పొందేందుకు వీటిని చాలా మంది వినియోగించే వారు. తర్వాత సెల్ఫోన్ల రాక మొదలైన తర్వాత వీటి వినియోగం క్రమంగా తగ్గిపోయి, 2000ల నాటికి పూర్తిగా కనుమరుగయ్యాయి.
పేజర్లు రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల ద్వారా పని చేస్తాయి. మొబైల్ నెట్వర్క్ అవసరం వీటికి లేదు. తమ జాడను ఇజ్రాయెల్ బలగాలు కనుగొనే వీలు లేకుండా, లొకేషన్ ట్రాకింగ్ సాధ్యం కాని పేజర్లను హెజ్బొల్లా సాయుధులు ఇంకా వినియోగిస్తున్నారు. యుద్ధ ప్రాంతాల్లో వీటికి సిగ్నళ్ల అంతరాయం, నెట్వర్క్ సమస్యలు కూడా ఉండవు. కాబట్టి, కేవలం హెజ్బొల్లా ఫైటర్లు సందేశాలు పంపుకునేందుకు మాత్రమే ఇవి పని చేస్తాయి.
హెజ్బొల్లా సాయుధులు వాడుతున్న వేలాది పేజర్లు ఒకేసారి పేలిపోవడం వెనుక ఇజ్రాయెల్ పాత్ర ఉందనే కథనాలు వస్తున్నాయి. ఈ పేజర్లన్నీ గత ఏడాది కాలంలోనే కొనుగోలు చేసినవి. వీటిని తైవాన్‌కు చెందిన ‘గోల్డ్ అపోలో’ అనే కంపెనీ నుంచి హెజ్బొల్లా కొనుగోలు చేసింది. తయారు చేసే సమయంలోనే వీటిల్లో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ పేలుడు పదార్థాలు అమర్చిందనే వార్తలు వస్తున్నాయి. అయితే, కనిష్ట సాంకేతికతతో నడిచే పేజర్లను ఒకేసారి ఎలా పేల్చయగలిగిందనేది ఇప్పటివరకు ఎవరికీ అంతు చిక్కడం లేదు.